Anna Chelli Maro Lolli: బిఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతున్నదనేది ఇప్పటికే చాలా సందర్భాల్లో బయటపడింది. దానికి తోడు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్టీలో వర్గపోరు ఉన్నదని స్పష్టమవుతోంది… లిక్కర్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన తర్వాత కవిత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నారు. తర్వాత యాక్టివ్ అయిన ఆమె, జాగృతిని యాక్టివ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లేఖాస్త్రం సంధించారు. పార్టీలో పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వరసగా కేటీఆర్‌ను టార్గెట్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, తన లేఖను సమర్థించుకుంటూ కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కేటీఆర్‌తో ఆధిపత్య పోరు కొనసాగుతున్నదని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి… కవిత వ్యాఖ్యల తర్వాత బిఆర్ఎస్‌లో ఒకటే కన్ఫ్యూజన్ నెలకొన్నది. ఒకవైపు కేసీఆర్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. తరచూ వైద్య పరీక్షలు అంటూ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఇంకోవైపు, పార్టీలో జరుగుతున్న ఆధిపత్య పోరుతో క్యాడర్‌లో ఒకటే కన్ఫ్యూజన్ నెలకొందంటా… దీంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందంటా… పార్టీ అన్నాక ఇలాంటివి సహజం అంటూ నేతలు చెబుతున్నా, గందరగోళ పరిస్థితి మాత్రం చక్కబడడం లేదనే తెలుస్తోంది…. స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న ఈ సమయంలో ఇది మరింత సమస్యగా మారుతుందన్న చర్చ జరుగుతున్నది.
Also Read: Journalist Should Be Unity: మీడియా మీద దాడిని ప్రశ్నించరా…!
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో సభ నిర్వహించి బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని చెప్పింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం కోటా అమలు దిశగా ముందడుగు వేసింది. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని, 2018 నాటి పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది. అయితే, ఇది ముమ్మాటికీ జాగృతి విజయం అంటూ ఆ సంస్థ అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంబురాలు చేసుకున్నారు. రైల్ రోకో నిర్వహిస్తామని తాము ప్రకటించడంతో దిగివచ్చిన ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అంగీకరించిందని అన్నారు. అయితే, కవిత మాట్లాడి 24 గంటలు గడవకముందే, బిఆర్ఎస్ బీసీ నేతలు మీడియా ముందుకొచ్చారు. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఆర్డినెన్స్ పేరుతో మంత్రి వర్గం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కేటీఆర్‌తో మాట్లాడి తమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఒకవైపు కవిత ఆధ్వర్యంలోని జాగృతి సంబురాలు చేసుకుంటుంటే, ఇంకోవైపు బిఆర్ఎస్ నేతలు అభ్యంతరాలు చెబుతుండడంతో మళ్లీ అన్న చెల్లి వార్ మొదలైందన్న చర్చ జరుగుతున్నది. ఇద్దరూ చెరో దారిగా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది….