Anita fight in PR Peta: పాయకరావుపేట ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, హోం మంత్రి వంగలపూడి అనితకు పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఫైర్ బ్రాండ్ అన్న పేరుంది. కానీ సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో మాత్రం అందుకు భిన్నంగా ఉండేది అనిత పరిస్థితి. కూటమి నాయకుల్లో కొందరు ముఖ్య నాయకుల నుండి వ్యతిరేకత ఎదుర్కొన్న ఆమె.. వారందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి నానా అవస్థలు పడ్డారు. అయినా కొందరు లోపాయకారీగా వ్యతిరేకించారు. దీంతో గట్టి సవాళ్లే ఎదుర్కొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలను కలుపుకొని వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురైనప్పటికీ అవన్నీ తట్టుకొని నిలబడ్డారు. అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడంలో సఫలీకృతమయ్యారు.
పాయకరావుపేట నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. ఆ నాలుగు మండలాలకు టీడీపీ అధ్యక్షులుగా కాపులనే నియమించారు. దీంతో బీసీ నాయకులు, కార్యకర్తలలో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో అనిత పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యువతను కలుపుకొని వెళ్లారు. ఇదిలా ఉండగా, పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో బీసీలు అధికంగా ఉన్నారు. వారి మద్దతు జనసేనకు అధికంగా ఉందని తెలుసుకున్న అనిత, పాయకరావుపేట జనసేన ఇన్‌చార్జ్ గెడ్డం బుజ్జిని కలుపుకొని జనసేన యువకులను ఆకట్టుకున్నారు. నియోజకవర్గంలోని బీసీ వర్గాలలోనూ అంతర్గత విభేదాలు ఉండేవి. ఆ విషయం తెలుసుకున్న అనిత, పాయకరావుపేటలో బీసీలలో పైచేయిగా ఉన్న మత్స్యకార, యాదవ సామాజికవర్గాల వారికి తన వద్ద ప్రత్యేక స్థానం కల్పించడంతో విభేదాలు లేకుండా చూడగలిగారు. అలా పార్టీలో అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి ఆమె నానా అవస్థలు పడినా, చివరికి అందరూ కలిసి పనిచేసే విధంగా చేసుకోగలిగారు.
పాయకరావుపేట టీడీపీకి కంచుకోటగా ఉండేది. అలాంటి కంచుకోట 2009 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో టీడీపీ నుండి చేజారింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గొల్ల బాబురావు ఎమ్మెల్యేగా గెలువగా… ప్రజారాజ్యం పార్టీ 49 వేల పైచిలుకు ఓట్లతో రెండవ స్థానంలో నిలిచింది. టీడీపీ మూడవ స్థానానికి పడిపోయింది. అప్పటి నుండి పీఆర్‌పీకి పనిచేసిన కార్యకర్తలు ఆ తరువాత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిన తర్వాత జనసేనకు షిఫ్ట్ అయ్యారు. వారితో పాటు ఈ ప్రాంతంలో జనసేన అధినేత పవన్‌కు అత్యధికంగా అభిమానులు ఉన్నారు. దీంతో ఈ సారి పాయకరావుపేట గడ్డ జనసేన అడ్డా అనే విధంగా జనసైనికులు అలుపెరుగని పోరాటం చేశారు. పొత్తులో భాగంగా సీటు టీడీపీకి రావడంతో వారు కొంత అసంతృప్తికి గురైనప్పటికీ, వారందరినీ తమ క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని బుజ్జగించి, జనసేన నుండి తనకు 100 శాతం ఓటు ట్రాన్స్‌ఫర్ అయ్యే విధంగా అనిత చేసుకోగలిగారు.
Also Read: AP Assembly: నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరు పై ఉత్కంఠ..!
గతంలో అనిత గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తల్ని.. గెలిచిన తరువాత ఆమె పక్కనపెట్టారని కొందరు నాయకులు విమర్శించారు. ఆ విషయాలన్నీ అనిత దృష్టికి వచ్చాయి. అనిత కూడా.. ఎవరు, ఎవరి దగ్గర, ఏమి అన్నారో అన్నీ దృష్టిలో పెట్టుకున్నారు. అలాగే టీడీపీలో తనకు సన్నిహితంగా ఉంటూ వ్యతిరేకంగా పనిచేసిన వారిని కూడా ఆమె మర్చిపోలేదని వినికిడి. కూటమి తరపున ఎవరు తనకు అనుకూలంగా పనిచేశారో, ఎవరు వ్యతిరేకంగా పనిచేశారో అనితకు తెలుసని, ఇప్పుడు హోం మంత్రిగా బిజీగా ఉంటున్నప్పటికీ… గత పరిస్థితిని ఆమె మర్చిపోలేదని టీడీపీ శ్రేణులు కొందరు చెబుతున్నారు. పాయకరావు పేటలో పవన్ ప్రభంజనం, జనసైనికుల మద్ధతు లేకపోతే.. సొంత పార్టీలోని వారే అనితను ఓడించేవారని గుర్తు చేస్తున్నారు.
పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా యువతకు ఉపాధి కల్పిస్తామని అనిత హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా నక్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో APIIC వారు భూ సేకరణ చేసిన ల్యాండ్‌లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఆ పార్క్ పూర్తయితే 20 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. గతంలోనే ఈ ప్రాంతంలో హెటెరో, డెక్కన్ ఫైన్ కెమికల్ పరిశ్రమలు ఏర్పాటైనా… వాటిలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఎఫెక్ట్ వల్లే… ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును అధిక సంఖ్యలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి కల్పన హామీని హోం మంత్రి అనిత ఎంతవరకు నెరవేరుస్తారో చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా, పక్క జిల్లాలో వ్యతిరేకించిన పరిశ్రమను నక్కపల్లిలో పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు పలు గ్రామాల ప్రజలు. ఇప్పటికే వచ్చిన పరిశ్రమల కారణంగా కాలుష్యం పెరిగిపోయిందని ఆందోళన చెందుతున్నారు. ఆ గ్రామాల ప్రజలు రానున్న రోజుల్లో అనితకు ఎంతవరకూ సపోర్ట్ చేస్తారో వేచి చూడాల్సిందే.