Balasoury Bouncer: లోక్ సభ సబార్డినేట్ లెజిస్టేషన్ కమిటీ చైర్మన్‌గా మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎంపికయ్యారు. ఈ పదవి చేపట్టడం ఆయనకు ఇది కొత్త కాదు. ఈ కమిటీకి చైర్మన్‌గా ఎన్నికవడం ఆయనకు ఇది వరుసగా నాలుగోసారి. గత ప్రభుత్వంలోనూ నాలుగు సంవత్సరాల పాటు ఈ కమిటీకి చైర్మన్‌గా పనిచేశారు ఎంపీ బాలశౌరి. చైర్మన్‌తో పాటు 15 మంది సభ్యులు ఉండే ఈ కమిటీలో కార్తిక్ చిదంబరం, మాజీ మంత్రి ఏ.రాజా, బెంగాల్ నుండి మొహిత్రి మొవ్వా, ఎన్‌కే ప్రేమచంద్, తెలంగాణ నుండి బీజేపీ తరఫున రఘునందన రావు వంటి ప్రముఖులు ఉన్నారు. ఎన్డీయే ప్రభుత్వంలో లోక్‌సభ జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న బాలశౌరి… గతంలో లోక్‌సభ సబార్డినేట్ లెజిస్టేషన్ కమిటీ చైర్మన్‌గా… తక్కువ సమయంలో ఎక్కువ సమావేశాలు నిర్వహించి రికార్డు నెలకొల్పారు.
వల్లభనేని బాలశౌరి వైఎస్ శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి.. 2004లో తెనాలి లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీ అయ్యారు. జగన్ మోహన్‌రెడ్డి తన అహంకారపూరిత ధోరణితో బాలశౌరి వంటి సమర్ధుడైన నేతను వదులుకున్నారని చెప్పాలి. జగన్ వైఖరి, అభివృద్ధి నిరోధక మనస్థత్వం నచ్చక పవన్ కళ్యాణ్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు బాలశౌరి. 2024 ఎన్నికలకు చాలా ముందే జనసేనలో చేరి.. జనసేన అధినేత ఆశీస్సులతో మచిలీపట్నం లోక్‌సభ నియోజకర్గంలో పోటీ చేసి.. 2 లక్షల 23 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. జనసేనలో క్రియాశీలకంగా పనిచేసిన బాలశౌరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి అభ్యర్థుల విజయానికి విశేషంగా కృషి చేశారు. నిత్యం పవన్ వెన్నంటి నడుస్తున్న బాలశౌరి… పార్లమెంటరీ వ్యవహారాలపై మంచి పట్టు ఉన్న నేతగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఎంపీ ల్యాడ్స్‌తో పాటు తన నియోజకవర్గానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో బాలశౌరిది అందె వేసిన చెయ్యిగా చెప్పాలి. తొలిసారి ఎంపీ అయిన దగ్గరి నుంచే ఢిల్లీ నుంచి తన నియోజకవర్గంలోని గల్లీ వరకు ప్రతీ సందర్భంలోనూ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు.
తెనాలి ఎంపీగా ఉన్న సమయంలో దివిసీమ పరిధిలోని దాదాపు 18 వేల ఎకరాలు చెరువులుగా ఉంటే.. సొంత నిధులు వెచ్చించి.. ఆయా చెరువులను పూడ్పించి.. వాటిని చదును చేయించి.. సాగు భూములుగా మార్చిన నాయకుడిగా ఎంపీ బాలశౌరి చిరస్థాయిగా నిలిచిపోయారు. తెనాలిలో తాగునీటి సమస్య పరిష్కారానికి కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి ఇంటికీ తాగునీటిని అందజేశారు. రేపల్లె నుంచి హైదరాబాద్ కాచిగూడ వరకు డెల్టా ఫాస్ట్ ప్యాసింజర్ రైలును తీసుకొచ్చిన ఘనత ఎంపీ బాలశౌరిదే. కృష్ణాడెల్టా జీవధారగా పిలుచుకునే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో ఎంపీ బాలశౌరి చాలా చురుగ్గా పాల్గొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఆపివేయాలని ఎంపీ బాలశౌరికి నక్సలైట్ల బెదిరింపులు వచ్చాయి. అయినా కూడా వాటిని లెక్కచేయకుండా ప్రాజెక్టును పూర్తి చేయించారు. ఇక ప్రాజెక్టు శంకుస్థాపన రోజు ప్రస్తుత పల్నాడు జిల్లా మోర్జంపాడు అనే గ్రామంలో ఉన్న ఎంపీ బాలశౌరి ఇంటిని నక్సలైట్లు డైనమైట్లు పెట్టి పేల్చివేసి ఇంటిని నేలమట్టం చేశారు. ఈ సంఘటన నాడు సంచలనంగా నిలిచింది. మచిలీపట్నం ఎంపీగా పోర్టు తీసుకురావటంలో ఆయన సక్సెస్ అయ్యారు. కేంద్రంలో రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలతో ఉన్న మంచి సంబంధాలతో సీఎస్ఆర్ నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగారు. ఏ అంశం పైన అయినా స్పష్టమైన విజన్‌తో ముందుకెళ్తారాయన.
Also Read: Nara Lokesh: ఏపీలో మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటనలో కీలక వ్యాఖ్యలు
Balasoury Bouncer: కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే మంగళగిరి ఎయిమ్స్ పాలకమండలి సభ్యుడిగా నియమితుడయ్యారు బాలశౌరి. తాజాగా బాలశౌరి నేతృత్వంలోని లోక్ సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ కాల పరిమితి ముగియగా… ఆ కమిటీని నూతనంగా ఏర్పాటు చేశారు. 15 మంది సభ్యులున్న ఈ కమిటీకి తిరిగి బాలశౌరినే చైర్మన్‌గా నియమిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభలో ఆయా కార్యకలాపాలు, సభ్యులకున్న అధికారాలు, బాధ్యతలు సరిగ్గా అమలయ్యేలా చర్యలు చేపట్టడం, సభ విధివిధానాల అమలును ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
1953లో ఏర్పాటైన ఈ కమిటీ ప్రభుత్వం జారీ చేసే రూల్స్, సబ్‌రూల్స్, బై లాస్, రెగ్యులేషన్స్, బిల్లులను పరిశీలించి… అవి రాజ్యాంగ పరిధిలోనే ఉన్నాయా లేదా అనే అంశంపై సభకు నివేదిక సమర్పిస్తుంది. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఉత్తర్వును పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ రద్దు చేయాలనిపించినా, సవరించాలని భావించినా ఈ కమిటీ అందుకు కారణాలను వివరిస్తూ సభకు నివేదిక సమర్పిస్తుంది. ఇంతటి గురుతర బాధ్యతలు ఉన్న ఈ కమిటీకి చైర్మన్‌గా తనను మరోసారి నియమించిన ఓం బిర్లాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో తనకు ఈ అవకాశం దక్కేలా చూసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు ఎంపీ బాలశౌరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.