Amaravathi Ki Modi : అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మే 2న పనుల పునః ప్రారంభోత్సవ సభను నిర్వహిస్తున్నారు. దీనికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సభ సందర్భంగా పలు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేయింబవళ్లు వందలాది మంది పనిచేస్తున్నారు. ప్రధాన వేదికతో పాటు.. మిగిలిన వేదికలు, వీవీఐపీ, వీఐపీ గ్యాలరీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే సభికులను దృష్టిలో ఉంచుకుని సభా ప్రాంగణంలో పెద్దఎత్తున కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలు నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే నిలిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ వస్తున్న నేపథ్యంలో.. ఏర్పాట్లలో లోటుపాట్లు ఉండకూడదని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్థానికంగానే ఉంటూ పనులు పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని రోడ్‌షో సాగే రహదారుల్లో శాంతిభద్రతల పరంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై పోలీస్ ఉన్నతాధికారులు ఫోకస్ పెంచారు. సభా ప్రాంగణానికి 8 మార్గాల్లో చేరుకునేలా రహదారులను సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సభాస్థలికి జనాల్ని తీసుకురావటానికి 2 వేలకు పైగా ఆర్టీసీ బస్సులను.. మరో 700 ప్రైవేటు బస్సులు వినియోగించనున్నట్టు తెలుస్తోంది. దాదాపు 5 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహణకు ఏపీ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.
2014 డిసెంబర్‌లో అమరావతి ప్రకటన వెలువడింది. మూడు నాలుగు నెలల కనిష్ట వ్యవధిలోనే 33 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛంధంగా రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. 2015 విజయదశమి సందర్భంగా ప్రధాని మోదీ అమరావతి శంకుస్థాపన చేశారు. పుణ్య నదుల తీరాల నుంచి సేకరించిన మట్టి, పుణ్య జలాలతో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2015 నుంచి 2019 మధ్య కాలంలో దాదాపు రూ.10 వేల కోట్లతో అమరావతి పనులు చేపట్టారు. 2016 ద్వితీయార్థానికి వెలగపూడిలో సచివాలయం అందుబాటులోకి వచ్చింది. 2018 నాటికి హైకోర్టు నిర్మాణం మొదలైంది. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడంతో అమరావతి నిర్మాణ పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. సరిగ్గా పదేళ్ల తర్వాత ప్రధాని మోదీ అమరావతిలో రెండోసారి నిర్మాణ పనులను పున: ప్రారంభిస్తున్నారు.
అమరావతిలో రాజధాని పనులు నిలిచిపోవడంతో దాని ప్రభావం గుంటూరు, విజయవాడలపై తీవ్రంగా పడింది. అమరావతి రాకతో విజయవాడ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ జోరు మీద ఉండేది. ఓ దశలో విజయవాడలోని పలు ప్రాంతాల్లో గజం భూమి రూ.లక్ష పైచిలుకు ధర పలికేది. రాజధానిని విశాఖపట్నం తరలిస్తున్నారనే ప్రకటనతో విజయవాడ, గుంటూరు మధ్య భూముల ధరలు పడిపోయాయి. ఓ వైపు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, పెట్టుబడులు పరుగులు తీస్తోంటే ఏపీ మాత్రం వెనుకబడి పోయింది. మరోవైపు రాజకీయ భయాందోళనలు పెట్టుబడిదారుల్ని భయపెడుతున్నాయి. రాజధాని విషయంలో వైసీపీ నేటికీ తన అభిప్రాయం మార్చుకోలేదని స్పష్టమౌతోంది.
Amaravathi Ki Modi: ఈ క్రమంలోనే ఆ పార్టీ రాజధానిపై అనేక విష ప్రచారాలకూ దిగుతోంది. పరిస్థితులు ఇలా ఉండబట్టే.. భవిష్యత్తులో ఎన్నికల్లో గెలుపొటములతో సంబంధం లేకుండా, ప్రభుత్వాలు మారినా రాజధాని మారదన్న భరోసాను పెట్టుబడిదారులు కోరుకుంటున్నారు. అమరావతి శాశ్వతమని కూటమి పార్టీలు చెబుతున్నా.. ఓ సాధికారిక ప్రకటన, భరోసాను ప్రధాని మోదీ నుంచి ఏపీ ప్రజానీకంతో పాటూ, అటు పెట్టుబడిదారులు కోరుకుంటున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా అమరావతి నిర్మాణాన్ని కొనసాగించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందనే స్పష్టత ఇవ్వగలిగే… నవ్యాంధ్ర కలల రాజధానికి ఇక తిరుగుండదు. పెట్టుబడులు రాకుండా ఏ దుష్ట శక్తులు అడ్డుకోలేవు. ప్రపంచ నేతగా పేరున్న మోడీని రాజధానికి రప్పించడం ద్వారా, ఆయన చేతుల మీదుగానే పున:నిర్మాణ పనులు ప్రారంభించడం ద్వారా.. పెట్టుబడిదారుల్లో ఆ రకమైన భరోసా కల్పించడమే సీఎం చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నంగా కనబడుతోంది.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం నిలబడటానికి ఆధారం ఏపీలో కూటమి పార్టీలే. కానీ కేంద్రం ప్రభుత్వంలో ఏపీ ఎలాంటి పదవులు ఆశించడం లేదు. పదవుల బదులు ప్రాజెక్టులకు నిధులు ఇవ్వమంటున్నారు సీఎం చంద్రబాబు. ‘బ్రాండ్ ఏపీ’ని తిరిగి నిలబెట్టేందుకు సపోర్ట్ చేయమని అడుగుతున్నారు. ఈ క్రమంలో మే 2న.. ప్రధాని నరేంద్రమోడీ.. రాజధాని అమరావతికి భారీ ఎత్తున నిధులు ప్రకటిస్తారన్న అంచనాలేమీ లేకపోయినా… ‘అమరావతి శాశ్వతం’ అన్న గట్టి సందేహం ఇస్తే చాలు… రాజధాని అభివృద్ధిని చుట్టుముట్టిన నీలి నీడలు పటాపంచలు అవుతాయని అంతా భావిస్తున్నారు. కోరకుంటున్నారు.

