Aluru TDP: కర్నూల్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతం ఆలూరు నియోజకవర్గం. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బీసీ కులాన్ని చెందిన వీరభద్ర గౌడ పోటీ చేసి అతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే పార్టీ ఎవరికి టికెట్ కేటాయించినా సహకరిస్తామన్న నేతలు… తీరా టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీలో ఉండి, సహకరించక పోవడం వల్లే ఓడిపోయానని పలుమార్లు వీరభద్ర గౌడ్ ఆరోపణలు చేశారు. అయితే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆలూరు నియోజకవర్గానికి ఓడిపోయిన వీరభద్ర గౌడే ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి ఉన్నప్పటికీ… ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు వీరభద్ర గౌడ.
ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంతో ప్రజలకు సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకెళ్తున్నారు ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లు. కానీ ఆలూరులో మాత్రమే ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముందు ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్‌గా వీరభద్ర గౌడ వ్యవహరించారు. కానీ జిల్లా అధ్యక్షుడు తిక్కా రెడ్డి అండ్ అధిష్టానం నియమించిన కోఆర్డినేటర్లతో వీరభద్ర గౌడ లేకుండానే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో వీరభద్ర గౌడ్ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా అధ్యక్షుని ఎదుటే నిరసనకు దిగారు. నియోజకవర్గ ఇంచార్జ్ లేకుండా ఎలా కార్యక్రమం నిర్వహిస్తారంటూ నిలదీశారు. దీంతో జిల్లా అధ్యక్షుడు ఆగ్రహంతో నియోజకవర్గ ఇంచార్జ్‌గా వీరభద్ర గౌడ్‌ని తొలగించామని గట్టిగా కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు అయోమయంలో పడ్డారు. జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన జిల్లా అధ్యక్షుడే ఇలా వ్యాఖ్యలు చేయడంతో… తెలుగు తమ్ముళ్లు ఆలోచనలో పడ్డారు. అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: Pemmasani Records: శ్రీమంతుడే కాదు ప్రజాసేవలో పనిమంతుడు కూడా..
గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులకే నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆలూరు నియోజకవర్గంలో మాత్రం మరోరకంగా జరుగుతోందని తెలుగు తమ్ముళ్లతో పాటు వీరభద్రగౌడ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆలూరు టీడీపీలో వర్గ విభేదాలకు ఆజ్యం పోస్తున్నారంటూ నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది. పార్టీ అధిష్టానం చెప్పకుండానే.. తానే నిర్ణయం తీసుకుని ఇంచార్జ్‌ని తొలగిస్తున్నామని చెప్పడం కరెక్ట్ కాదంటూ తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అందర్నీ కలుపుకొని పోయి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాల్సిన అధ్యక్షుల వారు.. ఒక వర్గానికి మద్దతు పలుకుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పార్టీ అధిష్టానం సీరియస్ అయ్యి ఆలూరు టీడీపీలో కుమ్ములాటలకు బ్రేక్ వేసినట్లు తెలిసింది. మొత్తానికి ఆలూరు టీడీపీలో ఇంచార్జి గోలపై తెలుగు తమ్ముళ్లతో పాటు పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.