Alekhya Chitti Pickles: అనగనగా ముగ్గురు అక్కచెళ్లెళ్లు. కరోనా పుణ్యమా అని సరదా సరదాగా రీల్స్ ప్రపంచంలోకి ఎంటరయ్యారు. కొద్ది రోజులకే సోషల్ మీడియాలో స్టార్లయ్యారు. రీల్స్ చేస్తూ, ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసినన్ని రోజులు వారి జోలికి ఎవ్వరూ రాలేదు. పైగా అడగకుండానే లైకులు, షేర్లు, కామెంట్లతో సహా, ఆదాయమూ వచ్చిపడేది. వన్ బ్యాడ్ డే… ముగ్గురు అక్కచెళ్లెల్లకు చుక్కలు చూపించడం మొదలుపెట్టారు మన నెటిజన్లు. ఎంతలా అంటే.. ప్రపంచమే వారిపై యుద్ధం ప్రకటించినట్లుగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సో కాల్డ్ మేధావులు, మానవతా వాదులు, పౌర హక్కుల కోసం పాటు పడేవాళ్లు.. ఒకరా ఇద్దరా.. రకరకాల జాతుల వారంతా జాంబీస్‌లా ముగ్గురు అక్కచెళ్లెళ్లను వెంటాడటం మొదలుపెట్టారు. మరి ఇంత జరిగాక జర్నలిస్టు మిత్రులు ఊరికే ఉంటారా? గంటలు గంటలు డిబేట్లు పెట్టి ప్రశ్నించారు. నీతులు చెప్పారు.
వారు చేసింది తప్పని తీర్పులు చెప్పారు. దేవుడిలా చూసుకోవాల్సి కస్టమర్‌ని అంతేసి మాటలంటారా అంటూ నిలదీశారు. కేసులు పెట్టాలన్నారు. మానవహక్కుల కమీషన్ ఢిల్లీ నుండి దిగిరావాలన్నారు. అవసరమైతే ఐక్యరాజ్య సమితి కూడా ఇమ్మిడియేట్‌గా జోక్యం చేసుకోవాలని డిమాండ్లు చేశారు. అయితే, ఇంత జరుగుతున్నా కానీ.. తనకు తీరని అన్యాయం జరిగిపోయిందని సోషల్‌మీడియాకు లీకులిచ్చి.. ఈ యుద్ధానికి కారణమైన ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో.. ఆయన మాత్రం.. బయటకు వచ్చినట్లు ఎక్కడా కనిపించలేదు. అంటే…. బాధితుడు ఎవరో తెలుసుకోకుండానే… ఈ సో కాల్డ్ ఇంటెలిజెంట్ జాతుల వారంతా అతనికి న్యాయం చేసేశారన్నమాట.
Alekhya Chitti Pickles: జరిగిన చెత్తంతా పక్కన పెట్టి చూస్తే.. ఈ సమస్య నిజానికి ఒక వ్యాపారికి, కస్టమర్‌కి మధ్య గొడవ. కానీ వేల కోట్ల స్కామ్‌కి ఇచ్చినంత ఎలివేషన్ ఇచ్చారు. మనం ఓట్లు వేసి, మనం గెలిపించుకున్న నాయకులే.. స్కాములు చేసి దర్జాగా మన మధ్యలోనే తిరుగుతుంటారు. తెలిసినా సరే వారికే ఓట్లు వేస్తూ ఉంటాం. మొత్తం దేశాన్నే ఒకరిద్దరు బడా పారిశ్రామికవేత్తలు తమ చెప్పు చేతల్లో నడిపిస్తుంటారు. అయినా సరే వారి ఉత్పత్తుల్నే కొంటూ ఉంటాం. ‘జియో’ వాడు రేట్లు పెంచితే ప్రశ్నించే వాళ్లు ఎంత మంది ఉంటారు? పోయాం మోసం.. అనుకుంటూ సర్దుకు పోతారు తప్ప.. రీచార్జ్ చేయడం మానుకంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మోసాలు, దారుణాలు జరుగుతున్నా.. ఈ సోకాల్డ్ జాతులు.. తమకేమీ పట్టనట్టుగా సోషల్‌మీడియాలో తలమునకలై ఉంటారనమాట. కానీ పచ్చళ్లు అమ్ముకునే ఒక అమ్మాయి తప్పుచేసి దొరికేసరికి.. నరికేద్దాం పదండి అంటూ బయలుదేరతారు. ఇది హిప్పోక్రసీ కాక మరేమిటి?
ఇక మీడియా సైతం ఈ రాద్ధాంతంలో పాలు పంచుకోవడమే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకప్పుడు మీడియాలో ప్రసారమయ్యే వార్తలు సోషల్‌మీడియాలో ట్రెండ్ అయ్యేవి. ఇప్పుడు సోషల్‌మీడియాలో ఏది ట్రెండ్ అయితే.. అదే వార్త అన్నట్లు మీడియా పరిస్థితి తయారైంది. అందుకు ఈ పచ్చళ్ల రచ్చే బెస్ట్ ఎక్జాంపుల్. నిజానికి ఈ సోషల్‌మీడియాలో నూటికి 80 శాతం మంది పనిలేని టైమ్ పాస్ బ్యాచులే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వారికి రోజుకో స్టఫ్ కావాలి. ఏ స్టఫ్ దొరకనప్పుడు.. రీల్స్ చేసుకునే అమ్మాయిలు, ఆడవాళ్ల వీడియోలకు వికృత కామెంట్లు పెట్టుకుంటూ సంతృప్తి చెందుతూ ఉంటారు.
Also Read: Pawan Kalyan: గిరిజన గూడేలకు రియల్ భీమ్లా నాయక్
Alekhya Chitti Pickles: వారి డ్రెస్సింగ్ గురించి, వారి అంగాంగాల గురించి కామెంట్స్ చేస్తూ పైశాచిక ఆనందం పొందే బ్యాచ్‌లు కొన్నైతే… వారికి మన సంప్రదాయాలు, సంస్కృతులపై క్లాసులు పీకుతూ కామెంట్లు పెట్టే బ్యాచ్‌లు మరికొందరుంటారు. వాస్తవానికి అలేఖ్‌య సిస్టర్‌కు సోషల్‌మీడియాలో క్రేజ్ తెచ్చింది ఈ ఆవారా బ్యాచ్‌లే. వారిని ఫాలో అవుతోంది, వారు తప్పు చేసి దొరకగానే వారి జీవితాలపై పడి బద్నాం చేసింది ఈ ఆవారా బ్యాచ్‌లే. వారి రీల్స్, ప్రమోషన్ వీడియోల్లో వారిపై అబ్యూజివ్ కామెంట్లు చేసిన సోకాల్డ్ నెటిజన్లే.. నేడు వారు చేసింది ఘోరం, నేరం అంటూ నీతులు, తీర్పులు చెప్పేశారు. సోషల్‌మీడియాని పరిశీలిస్తే… ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూ గత రెండు కిందట నుంచే సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతోంది.
‘అలేఖ్య చిట్టి పికిల్స్ రివ్యూ’ అనేది ట్రెండింగా మారిపోయింది. వారి పికిల్స్ కొని రివ్యూలు ఇవ్వడం ప్రతి ఒక్క బ్లాగర్ ఒక పనిలా పెట్టుకుని చేసినట్లు అర్థమౌతోంది. చివరికి ఆ అజ్ఙాత కస్టమర్ తనకు జరిగిన అవమానాన్ని బయటపెట్టడం, సోషల్‌మీడియా ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం వల్ల.. ఇదేదో సమాజానికి అతి ముఖ్యమైన వార్త అన్నట్లు.. అన్ని మీడియా చానళ్లు టేకప్ చేశాయి. అంటే ప్రజల్లో అజెండా క్రియేట్ చేసే స్థాయి నుండి.. సోషల్‌మీడియాలో పనిలేని బ్యాచ్‌లు క్రియేట్ చేసిన అజెండాని.. మీడియా చానళ్లు నెత్తికెత్తుకునే పరిస్థితి వచ్చిందనమాట.