Akhila Priya: ఆళ్లగడ్డ. ఈ నియోజకవర్గం ఎప్పుడూ ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా ఉంటోంది. రకరకాల గొడవలు, ఆరోపణలతో పొలిటికల్ హీట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. గతంలో ఇక్కడ ముఠా కక్షలు, రాజకీయ ఘర్షణలు చాలా కామన్. అదంతా వేరే సంగతి. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన, చౌకబారు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయట. గత ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగిన పోరులో విజయం సాధించిన భూమా అఖిలప్రియ, ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా తాను ఎదుర్కోగలనన్న సంకేతాలను ప్రత్యర్థులకు బలంగా తెలియజేసింది అంటారు అక్కడి లోకల్ పొలిటికల్ పండిట్స్. అంతవరకూ బాగానే ఉన్నట్టు అనిపించినా, అసలు కథ అంతా ఇక్కడే మొదలైంది అంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు.
తల్లితండ్రుల రాజకీయ వారసత్వంతో అడుగుపెట్టి, చుట్టుముట్టిన అనేక సమస్యల నుంచి బయటపడేందుకు అఖిలప్రియ అస్మదీయులతో పాటు, తన పతనాన్ని కోరుకునే తస్మదీయులతోనూపెద్ద యుద్ధమే చేసిందంటారు ఆళ్లగడ్డలోని భూమా అభిమానులు. ఒంటరి మహిళగా నిలిచి, తన వర్గాన్ని కాపాడుకుంటూనే రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో అటాక్ చేయడంలో అఖిలప్రియ స్టైలే వేరంటారు అక్కడి వారు. తాజాగా 2024 ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి అఖిలప్రియ వర్కింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. సొంత పార్టీలోని ప్రత్యర్థులతో పాటు, ప్రత్యర్థి పార్టీ నేతలపై పైచేయి సాధించేందుకు అవసరానికి మించి దూకుడుగా వెళ్తున్నారన్న అపవాదును సైతం గత సంవత్సర కాలంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మూటగట్టుకున్నారు.
ఎమ్మెల్యే ఆలోచన ఒకటైతే, ఆమె అనుచరుల తీరు మరోలా ఉండటంతో కొత్త సమస్యలు వస్తున్నాయన్న టాక్ నియోజకవర్గంలో గట్టిగా వినబడుతోందట. నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే అనుచరుల అత్యుత్సాహం, ఎమ్మెల్యే పేరిట చేస్తున్న పనులు నియంతృత్వ పాలనను తలపిస్తున్నాయని రాజకీయ ప్రత్యర్థులతో పాటు స్థానిక వ్యాపారులు సైతం విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరులపై కేసులు పెట్టడం దాకా వెళ్లిందంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అక్కడి రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మామూళ్ల వసూళ్లకు కాదేదీ అనర్హం అన్నట్టు ఎమ్మెల్యే అనుచరులు చెలరేగిపోతున్నారన్న విమర్శలు ఎమ్మెల్యే ఉనికినే దెబ్బతీసే విధంగా ఉన్నాయట. కూరగాయల బండ్లు, చికెన్ షాపులు, ఫర్నిచర్ షాపులు మొదలు ప్రత్యర్థి వర్గాలకు చెందిన సానుభూతిపరుల వ్యాపారాలపై కత్తి కట్టి మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ప్రచారం లోకల్‌గా గట్టిగా సాగుతోందట.
Also Read: Rambabu Navarasalu: ఎవరు ఏమనుకున్నా డోన్ట్ కేర్!
Akhila Priya: లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్టు, అనుచరుల ఆగడాలు ఎమ్మెల్యే ఎరిగే జరుగుతున్నాయా లేదా అన్నది ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలిందట. మద్యం దుకాణాల సిండికేట్ గురించి అందరికీ తెలిసిందే. అయితే, ఆళ్లగడ్డలో మాత్రం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చికెన్ సిండికేట్ నడపాలని ఎమ్మెల్యే అనుచరులు బలవంతం చేస్తున్నారని అక్కడి చికెన్ వ్యాపారులు రోడ్డెక్కిన పరిస్థితి నెలకొందంట. ఆళ్లగడ్డలో ఈ చికెన్ మసాలా ఘాటు పొలిటికల్ టర్న్ తీసుకొని, ఏకంగా ఎమ్మెల్యేనే వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి రావడంతో ఎమ్మెల్యే అనుచరులు కొంతమేరకు వెనక్కి తగ్గారట. ఇలా లెక్కకు మిక్కిలి ఆరోపణలు, అపవాదుల నడుమ సంవత్సర కాలం అధికార దర్పం చాటుకున్న ఎమ్మెల్యే అఖిలప్రియ.. ప్రత్యర్థులపైనే కాకుండా, పదవుల విషయంలో సొంత పార్టీ అధిష్ఠానానికి కూడా అల్టిమేటం జారీ చేయడం కొసమెరుపుగా చెప్పుకోవాలి అంటున్నారు పొలిటికల్ క్రిటిక్స్.
ఏది ఏమైనా, అఖిలప్రియ ఎందుకిలా చేస్తున్నారు? తనపై వస్తున్న ఆరోపణలకు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? అన్న సందేహాలు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా అభిమానులతో పాటు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయట. గతంలో మంత్రిగా కూడా పనిచేసిన అఖిలప్రియ… నియోజకవర్గంలో ఎన్నడూ ఇంతటి అపప్రద మూటగట్టుకోలేదని, నేడు కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నా… ఇంత రచ్చ ఎందుకనే చర్చ… సొంత పార్టీలోనే జోరుగా సాగుతోందట. చూడాలి మరి, ఈ విమర్శల సుడిగుండం నుంచి… ఫైర్ బ్రాండ్‌గా పేరున్న అఖిల.. ఎలా బయటపడతారో తెలియాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే అంటున్నారు లోకల్ పొలిటికల్ పండిట్స్. ఏది ఏమైనా, లేడీ ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న ఎమ్మెల్యే అఖిలప్రియ.. వివాదాలతో సహవాసం చేయకుండా, ప్రజాసేవలో… తల్లి, తండ్రుల లెగసీని కొనసాగించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.