Agent Sai Reddy On Duty: ఏపీ లిక్కర్ స్కామ్‌లో విజయసాయిరెడ్డి నిజంగానే విజిల్ బ్లోయర్ పాత్ర పోషిస్తున్నారా? లేక అప్రూవర్‌గా మారడానికి తాను సిద్ధంగా ఉన్నానని సంకేతాలిస్తున్నారా? ఈ స్కామ్‌లో ఇప్పటిదాకా అరెస్ట్ అయినవారు, ఇకపై అరెస్ట్ కాబోతున్న వారు… విజయసాయిరెడ్డి సీఐడీకి ఇచ్చిన సమాచారం మేరకే కథ మొత్తం నడుస్తోందా? ప్రస్తుతం విజయసాయిరెడ్డి పోషిస్తోంది.. వైసీపీలో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే శిఖండి పాత్రనా? లేక తన రాజకీయ భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వానికి సహకరిస్తున్న ఏజెంట్ పాత్రనా? టేక్ ఎ లుక్..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న 4 వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పోషిస్తున్న పాత్ర అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఆయన తనను తాను విజిల్‌బ్లోయర్‌గా చెప్పుకుంటున్నప్పటికీ, ఈ కేసులో ఆయన ఉద్దేశాలు, చర్యలు, రకరకాల పొలిటికల్ డైనమిక్స్‌తో ముడిపడి ఉన్నాయేమోనన్న అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
విజయసాయి రెడ్డి, వైసీపీకి రాజీనామా చేసి, రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న తర్వాత, లిక్కర్ స్కామ్ విచారణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ముందు సాక్షిగా హాజరయ్యారు. ఆయన రాజ్ కసిరెడ్డిని స్కామ్‌లో ప్రధాన సూత్రధారిగా ఆరోపిస్తూ, తాను ఒక్క రూపాయి ముట్టలేదని, తనది విజిల్ బ్లోయర్ పాత్ర అని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. అయితే, విజిల్ బ్లోయర్‌గా ఉండాలంటే ఈ స్కామ్‌ని ఆయన ముందుగానే బయటపెట్టి ఉండాలి. కానీ సిట్ విచారణ ప్రారంభించిన తర్వాతే విజయసాయిరెడ్డి విజిల్ బ్లోయర్ అవతారం ఎత్తారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. ఈ లిక్కర్ స్కామ్ విచారణలో విజయసాయిరెడ్డి తనంతట తానే తలదూర్చారు.
Also Read: PM Modi: ఉగ్రవాదులకు కఠిన శిక్ష తప్పదు..ఉగ్రదాడిలో మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తాం.
Agent Sai Reddy On Duty: అసలు ఈ రాజ్ కెసి రెడ్డి పేరును విజయసాయిరెడ్డి బయటపెట్టక ముందు బాహ్య ప్రపంచానికి అతనెవరో కూడా తెలీదు. అప్పటి వరకు ఆ పేరు మాజీ సీఎం జగన్ పేషీలోని అతి కొద్ది మందికి తప్ప వైసీపీ నేతలకు కూడా తెలీదు. విజయసాయిరెడ్డి చెప్తున్నట్లు లిక్కర్ స్కామ్ కర్త, కర్మ, క్రియ రాజ్ కెసి రెడ్డే అయితే.. అతని పేరును విజయసాయిరెడ్డి ఎందుకు బయటపెట్టినట్టు? అది కూడా ఎవరి ఒత్తిడి లేకుండానే లిక్కర్ స్కామ్ విచారణలో తలదూర్చి, కెసి రెడ్డి పేరు ఎందుకు రివీల్ చేసినట్లు? తెలియాలంటే ఓ మూడు నెలల ముందు నుండి జరుగుతున్న పరిణామాలను భేరీజు వేసుకోవాలి.
2025 జనవరి 6. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు విజయసాయి రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చాక విజయసాయిరెడ్డి ఎదుర్కొన్న తొలి విచారణ అది. కాకినాడ సెజ్ మరియు కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ షేర్ల బదలాయింపు వ్యవహారంపై ఆ రోజు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. విజయసాయిరెడ్డిపై ఏపీ సీఐడీ… పోర్టు కేసు నమోదు చేసినప్పుడు ఆయన చిందులు తొక్కారు. చంద్రబాబు ప్రాణాలతో ఎలా ఉంటాడో చూస్తామన్నట్లుగా మాట్లాడారు. తనకు లుకౌట్ నోటీసులు జారీ చేయడంపై ఆ రకంగా తీవ్రంగా స్పందించారు. కానీ ఈడీ అధికారులు పోర్టు కేసులో పిలిచి ప్రశ్నించిన తర్వాత ఏం జరిగిందో తెలుసుగా… కొద్ది రోజుల్లోనే.. 2025 జనవరి 24న అసలు రాజకీయాల నుండే తప్పుకుంటానని ప్రకటించారు.
ఆ మరుసటి రోజే.. రాజకీయాల నుంచి విరమించుకోవడమే కాకుండా, తన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులు కున్నారు. అదే రోజు చంద్రబాబుతో తనకు వ్యక్తిగత గొడవలు లేవని, పవన్ కళ్యాణ్ తనకు మంచి మిత్రుడనీ చెప్పుకొచ్చారు. అంతేనా… కేంద్రంలో నరేంద్రమోడీ, అమిషాల ద్వయాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. వారికి వీర విధేయునిగా మసలుకుంటానని ప్రతిజ్ఞ కూడా చేశారు. అయినా సరే.. పోర్టు కేసు విజయసాయిరెడ్డిని వదల్లేదు. వెంటాడుతూనే వచ్చింది. ఈ క్రమంలో ఆయన మరోసారి.. అంటే 2025 మార్చి 10న మరోసారి సీఐడీ విచారణ ఎదుర్కొన్నారు. సరిగ్గా ఇక్కడ నుండే విజయసాయిరెడ్డిలోని విజిల్‌బ్లోయర్ బయటకొచ్చాడు.
Also Read: PSR Anjaneyulu: ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులకు అస్వస్థత
Agent Sai Reddy On Duty: 2025 మార్చి 10న విజయసాయిరెడ్డి సీఐడీ విచారణకు హాజరైంది కాకినాడ పోర్టు కేసులో. కానీ ఆయన సీఐడీ కార్యాలయం నుండి బయటకొచ్చి మీడియాతో మాట్లాడింది లిక్కర్ స్కామ్ గురించి. ఆ రోజే రాజ్ కెసి రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. లిక్కర్ స్కామ్ కర్త కర్మ క్రియ రాజ్ కెసి రెడ్డేనని, కావాల్సి వస్తే లిక్కర్ స్కామ్ పూర్తి వివరాలు బయటపెడతానని ఆరోజే చెప్పేశారు. దీంతో విజయసాయిరెడ్డిని సాక్షిగా పిలిచి, వాంగ్మూలం తీసుకోవాల్సిన పరిస్థితి సిట్‌కు అనివార్యంగా ఏర్పడింది. నాటి నుండి లిక్కర్ స్కామ్‌లో ఒక్కొక్కరి పేరు రివీల్ అవడం, అరెస్టులవడం జరిగిపోతూ వస్తోంది. రాజ్ కసిరెడ్డి A-1గా అరెస్టయ్యారు. మిధున్‌రెడ్డి సుప్రీంకోర్టు వరకూ వెళ్లి అరెస్ట్ నుండి రక్షణ పొందారు. సజ్జల రామకృష్ణారెడ్డి సమీప బంధువు.. ఎస్పీవై ఇండస్ట్రీస్ తరపున లిక్కర్లు తయారు చేసి అమ్మిన సజ్జల శ్రీధర్ రెడ్డిని తాజాగా అరెస్టు చేశారు. లిక్కర్ స్కాంలో సజ్జల శ్రీధర్ రెడ్డిది కీలక పాత్ర. మద్యం కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేయడంలో.. ఉత్పత్తికి తగ్గట్లుగా కప్పం కట్టించుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. మరో నిందితుడు ఏ8గా ఉన్న చాణక్యను సైతం అరెస్ట్ చేశారు. సిట్ విచారణలో విజయసాయి ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ అరెస్టులు జరిగాయని ఖచ్చితంగా చెప్పడానికి లేదు. అయినా.. కీలక నిందితులు కలుగు నుండి బయటకొస్తున్నారు.
మూన్నెళ్ల క్రితం మొదలైన కాకినాడ పోర్ట్ కేసు దర్యాప్తు నుంచి ప్రస్తుతం ఊపందుకున్న లిక్కర్ స్కామ్ దర్యాప్తు వరకూ.. జరిగిన పరిణామాలన్నీ గమనిస్తే… సాయిరెడ్డి రాజకీయ అస్త్ర సన్యాసం, రాజ్యసభ సీటు సైతం వదులుకోవడం, క్రమంగా కాకినాడ పోర్ట్ కేసు చల్లబడటం, తాజాగా సాయిరెడ్డి సెంట్రిక్‌గానే లిక్కర్ స్కామ్ కేసు ఊపందుకోవడం.. చిన్న చేపల అరెస్ట్ నుండి తిమింగలానికి ఉచ్చు బిగుసుకునే దాకా.. విజయసాయిరెడ్డి పాత్ర.. అప్రకటిత అప్రూవరా? లేక ఇంటెలిజెంట్ ఏజెంటా? అనేది ఎవరికి వారు అర్థం చేసుకోవాల్సిందే.