Adi Neyyi Kadu: తిరుమల లడ్డూ.. కోట్లాది భక్తులు ఆరాధనతో స్వీకరించే ప్రసాదం. దివ్య రుచికి చిహ్నం. దీని తయారీకి టీటీడీ.. ఎంపిక చేసిన విక్రయదారుల నుంచి స్వచ్ఛమైన నెయ్యిని కొనుగోలు చేస్తుంది. కానీ, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక, ఈ పవిత్ర ప్రక్రియలో మాయమైన మోసం జరిగింది. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం గురువారం ఏపీ హైకోర్టుకు సంచలన విషయాలువెల్లడించింది. తిరుమల లడ్డూ తయారీకి వాడింది అసలు నెయ్యే కాదని… పామాయిల్, రసాయనాలతో కూడిన కల్తీ మిశ్రమమని తేల్చింది. ఈ విషయం ఇప్పుడు శ్రీవారి భక్తుల్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. కల్తీ లిక్కర్‌తో ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్న వైసీపీ పాలకులు.. పవిత్రమై శ్రీవారి లడ్డూను వదల్లేదని, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఈ కల్తీ నెయ్యి ఉదంతం తెలియజేస్తోంది.
2019 వరకు శ్రీవారి ప్రసాద తయారీలో నాణ్యత ప్రమాణాలను కఠినంగా పాటించింది తిరుమల తిరుపతి దేవస్థానం. కానీ, వైసీపీ పాలనలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు రాగానే భక్తులు ఆందోళన చెందారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శల మధ్య ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ ఏర్పాటైంది. ఇందులో సీబీఐ, ఏపీ పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నారు. ఈ సిట్ దర్యాప్తు ఫలితాలు దిగ్భ్రాంతిని కలిగించేలా ఉన్నాయి. గతంలో టీటీడీ చేత బ్లాక్‌లిస్ట్ చేయబడిన బోలేబాబా డెయిరీ… వైసీపీ నేతల మద్దతుతో మళ్లీ సరఫరా చైన్‌లోకి చొచ్చుకొచ్చింది. ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీల ద్వారా పామాయిల్, రసాయనాలతో కల్తీ చేసిన నకిలీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసింది. ఈ మోసం వైసీపీ పాలనలో గుట్టుగా కొనసాగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక, ఈ అక్రమాలు బయటపడ్డాయి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల లడ్డూకు జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి.. విజయవాడలోని కనకదుర్గ ఆలయ మెట్లను కడిగి నిరసన తెలిపారు. ఆ రకంగా తిరుమల పవిత్రతపై జరిగిన కుట్రను దేశవ్యాప్త చర్చగా మార్చారు.
Also Read: Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనలో నలుగురికి రిమాండ్
Adi Neyyi Kadu: సిట్.. కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ కల్తీ నెయ్యి వ్యవహారం నిజమని తేలింది. వాస్తవాలను కోర్టు ముందుంచుతూ… నిందితులు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరించాలని సిట్ కోరింది. నిందితులు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ కేసులో నిందితులు.. సాక్షులను బెదిరించడం, తప్పుడు పిటిషన్లు దాఖలు చేయడం, తిరుపతి ఎయిర్‌పోర్టులో ఒక సాక్షిని కిడ్నాప్ చేసి చెన్నై, ఢిల్లీకి పంపడం వంటి దారుణాలు కూడా జరిగాయి. ఇక దర్యాప్తులో భాగంగా మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏను కూడా ప్రశ్నిస్తోంది సిట్ బృందం. ఈ కల్తీ నెయ్యి మాఫియా వెనుక.. స్థానిక ముఠా హస్తం ఉందన్నది తాజా సమాచారం. ఇప్పుడు ఈ కుంభకోణంలో అందరి పాత్రలు బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి.
భక్తులు, ప్రజాసంఘాలు జరిగిన అపచారానికి న్యాయం కోరుతూ ఆందోళనలు చేస్తున్నాయి. శ్రీవారి లడ్డూ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తున్నాయి. అసలు టీటీడీ ఈ నకిలీ నెయ్యిని ఎలా స్వీకరించింది? వైసీపీ హయాంలో ఈ మోసాన్ని ఎవరు సాగనిచ్చారు? సీబీఐ సిట్ ఈ కుట్రను పూర్తిగా బయటపెట్టేందుకు సిద్ధమౌతోంది. అతి త్వరలోనే సత్యం వెలుగులోకి రానుంది. అయితే ఈ కల్తీ నెయ్యి కుంభకోణాన్ని వైసీపీ సమర్థించుకుంటున్న తీరు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అది అసలు నెయ్యే కాదని సిట్ తేల్చింది తప్ప… టీడీపీ నేతలు ఆరోపించినట్లు జంతువుల కొవ్వు కలిసినట్లు సిట్ ఎక్కడా చెప్పట్లేదని వాదిస్తోంది వైసీపీ. నెయ్యి కల్తీ జరగడం కాదు.. నెయ్యికి బదులు పూర్తిగా కల్తీ పదార్థంతో లడ్డూ తయారీ జరిగిందన్న దారుణాన్ని పక్కనపెట్టి, టీడీపీ నేతలు ఆరోపించినట్లు జంతువుల కొవ్వేమీ లేదని తేలిపోయిందంటూ ఎదురుదాడికి దిగుతోంది. చేసిన పాపాలను ఇలా కూడా సమర్థించుకోవచ్చా అని ఆశ్చర్యపోవడం ఇప్పుడు విశ్లేషకుల వంతైంది.

