ADB losing Grip: రాష్ట్ర మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. వాటిలో కనీసం ఐదు, వీలైతే ఆరింటినీ భర్తీ చేసేలా సామాజిక, కుల సమీకరణలు, జిల్లాలకు సమాన ప్రాతినిధ్యం, రాజకీయంగా లాభించే అంశాలను బేరీజు వేసి కాంగ్రెస్ హైకమాండ్ గత నెలలో తుది కసరత్తును పూర్తి చేసిందని వార్తలు వచ్చాయి. ఏప్రిల్ మొదటి వారంలో విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగినా, చివరి నిమిషంలో క్యాబినెట్ విస్తరణకు బ్రేక్ పడింది. ఏడాదిన్నరగా సహనంతో ఎదురుచూసిన ఆశావహులు మరోసారి విస్తరణ వాయిదా పడటంతో మండిపడుతున్నారు. తమకు మంత్రి పదవులు రాకుండా మోకాలడ్డుతున్నారంటూ బహిరంగ విమర్శలతో గొంతెత్తుతున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్నవారిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఉన్నారు.
తనకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేసినట్లవుతుందని, తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధిష్ఠానాన్ని గట్టిగా హెచ్చరించారు. ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ సోదరులు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని వీడిపోయి, ఎన్నికలకు ముందు మళ్లీ చేరి ఇప్పుడు మంత్రి పదవులు కోరుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముందే మండిపడ్డారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లాలోని ఆదివాసీలకు, కార్యకర్తలకు ఊపిరిగా నిలిచిన నాకు అన్యాయం చేస్తారా? పదేళ్లు పార్టీని కాపాడుకొచ్చిన నాకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నలు గుప్పించారు. తనకు అన్యాయం చేస్తే భరిస్తాను కానీ, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఆదివాసీ, దళిత, మైనార్టీల గొంతునొక్కే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. మాట ఇచ్చిన మేరకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని, లేదంటే దేనికైనా సిద్ధమేనంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు.
ADB losing Grip: మంత్రి పదవి రాకుండా తన గొంతు నొక్కుతున్నారంటూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌పై చేసిన విమర్శలు హాట్ టాపిక్‌గా మారాయి. తనపై ప్రేమ్ సాగర్ రావు చేసిన విమర్శలకు వివేక్ కౌంటర్ ఇచ్చారు. కాకా కుటుంబం అంటే సేవ చేసే కుటుంబమని, మా కుటుంబంపై పరోక్షంగా విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. గత ఎన్నికల్లో కాకా కుటుంబం ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చి కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తేనే చేరానన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఇప్పటివరకు కాకా కుటుంబం నుంచే ఎంపీలుగా గెలిచి సత్తా చాటామని గుర్తు చేశారు. దమ్మూ ధైర్యం ఉంటే నాపై పోటీ చేసి గెలవాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన సవాల్‌ను స్వీకరించి, 22 రోజుల్లో ప్రచారం చేసి బాల్క సుమన్‌ను చిత్తుగా ఓడించి సత్తా చూపానన్నారు.
Also Read: SMITHA SABHARWAL: కంచ గచ్చిబౌలి వివాదంపై స్మితా సబర్వాల్‌కు పోలీసుల నోటీసులు
ADB losing Grip: బీజేపీలో కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌లో చేరానని చెప్పుకొచ్చారు. కొందరు పోలీసులను అడ్డుపెట్టుకొని బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. అలాంటి రాజకీయాలు తనకు అసహ్యమన్నారు. నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏం చేస్తున్నాడో ప్రజలు గమనిస్తున్నారన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక, బియ్యం దందాలకు అడ్డుకట్ట వేశానని వివేక్ తెలిపారు. నాయకులు మంచి పనులు చేస్తేనే ప్రజల్లో గుర్తింపు ఉంటుందని, ఆ గుర్తింపే ఎన్నికల్లో గెలుపుకు నాంది అవుతుందని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు నోరు జారుతుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో గట్టిగా స్పందించినట్లు సమాచారం. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని సీఎం హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువని హెచ్చరించారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని, దీనిపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదని సీఎం తేల్చి చెప్పారు. చూడాలి మరి, ముఖ్యమంత్రి హెచ్చరిక మేరకు నేతలు నోరు జాగ్రత్తగా వాడతారో లేక స్వరం పెంచుతారో!

