ADB Dist New Congress President: అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక వ్యవహారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాక పుట్టిస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవులకు డిమాండ్ ఉంది. అందులోనూ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఇప్పుడే ఉండదని ప్రచారం జరగగా, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో తాజాగా కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఏఐసీసీ పరిశీలకులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నాలుగు జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఆశావహుల నుంచి పేర్లు సేకరించడంతోపాటు జనంలో పట్టున్న వారి పేరును కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపిస్తున్నారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికకు సంబంధించి ఏఐసీసీ సూచన మేరకు టీపీసీసీ ఆచితూచి అడుగులు వేస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వివాదాస్పదం కాకుండా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేసే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఏఐసీసీ పరిశీలకులతో పాటు, రాష్ట్ర పరిశీలకులను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పంపిస్తున్నారు. పరిశీలకులలో ఉమ్మడి జిల్లాకు సంబంధం లేని వారిని పంపి వాస్తవ పరిస్థితులను సేకరించే బాధ్యతలను పరిశీలన కమిటీకి టీపీసీసీ అప్పగించింది. ప్రతి జిల్లా నుంచి నలుగురి పేర్లను అధిష్ఠానానికి పంపే బాధ్యతను పరిశీలకులు చేపట్టనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలలోనూ తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి నలుగురిలో ఇద్దరిని మళ్లీ కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఒకవేళ పోటీ తీవ్రం అయితే ఒకరు మాత్రం కొనసాగుతారని, మూడు జిల్లాలకు కొత్త అధ్యక్షులను ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతున్నది.
Also Read: Sundar Pichai: సుందర్ పిచాయ్ ట్వీట్: విశాఖపట్నంలో గూగుల్ AI హబ్! దేశంలో టెక్నాలజీకి కొత్త మైలురాయి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్, సోయం బాపూరావు, అడ్డి బోజారెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాతలు ఆశిస్తున్నారు. నిర్మల్ డీసీసీ అధ్యక్ష స్థానం కోసం సిట్టింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రావు మరోసారి పదవి కోసం లైన్‌లో ఉన్నారు. ఆయనతో పాటు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, రాజేశ్వర్, ఆనంద్ రావు పటేల్, జుట్టు అశోక్, తదితరులు దరఖాస్తు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల డీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మరోసారి ఆ పదవిలో కొనసాగాలని అనుకుంటున్నారు. ఆమెతో పాటు మరో ముగ్గురు పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ఇక ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి విశ్వ ప్రసాద్ రావు, బాలేశ్వర్ గౌడ్, శ్యాం నాయక్ పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. పరిశీలకులు ఇచ్చే నివేదిక మేరకు కొన్ని మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈసారి ఒక చోట వారికి పదవి దక్కే అవకాశం ఉంది. మరోపక్క ఉమ్మడి జిల్లాలో ఒక్క బీసీకి, ఒక మహిళకు అవకాశం ఇచ్చే చాన్స్ ఉందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో నేతల వర్గపోరుతో సతమతమవుతున్న కార్యకర్తలకు కొత్త నేతల ఎంపికతో ఏ వర్గానికి మద్దతు ఇవ్వాలో, ఎట్టి మద్దతు ఇస్తే ఏమవుతుందోనని సతమతమవుతున్నారట. చూడాలి మరి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హస్తం పార్టీ బలోపేతంపై నేతలు ఏమి చేస్తారో…