Second innings: సివిల్ సర్వీసెస్‌లో దశాబ్దాలపాటు పవర్ రుచి చూసిన వారికి రాజకీయం ఒక సహజమైన గమ్య స్థానంగా కనిపిస్తుంది. అయితే అందరూ అలాగే ఉంటారని చెప్పలేము. జయప్రకాష్ నారాయణ లాంటి వారు ‘లోక్‌సత్తా’ స్థాపించి, రాజకీయాల్లో నీతి-నిజాయితీలకు పెద్దపీట వేయాలనుకున్నారు. 2009లో కూకట్‌పల్లి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, ఆ తర్వాత లోక్‌సత్తా ప్రభావం క్షీణించింది. అదే విధంగా, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్ పార్టీ’తో సొంతంగా రాజకీయ గుర్తింపు సాధించాలనుకున్నారు. కానీ, 2024 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసిన జేడీకి వచ్చింది కేవలం 5,160 ఓట్లే. అదే జేడీ లక్ష్మీనారాయణ 2019లో జనసేన నుంచి విశాఖ లోక్‌సభకు పోటీ చేస్తే 2.88 లక్షల ఓట్లొచ్చాయి. జనసేనతోనే పొలిటికల్ జెర్నీ మొదలుపెట్టిన జేడీ ఆ పార్టీలో ఇమడలేక బయటకొచ్చారు. జనసేన మాత్రం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంతో మొదలు పెట్టి 21 స్థానాలకు ఎగబాకింది. ఈ ఉదాహరణలు చూస్తే, సొంత పార్టీలు స్థాపించిన మాజీ బ్యూరోక్రాట్లు జనాల్లోకి చొచ్చుకెళ్లడంలో విఫలమవుతున్నారని అర్థమవుతోంది.
మరోవైపు, ఇప్పటికే బలమైన రాజకీయ పార్టీల గూటికి చేరిన మాజీ అధికారులు సాపేక్షంగా మెరుగైన ఫలితాలు సాధించారు. ఆదిమూలపు సురేష్ కాంగ్రెస్, వైసీపీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కూడా పనిచేశారు. వెలగపల్లి వరప్రసాద రావు వైసీపీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేగా విజయాలు సాధించారు. దేవ వరప్రసాద్ జనసేన ద్వారా రాజోలు నుంచి గెలుపొందారు. తెలంగాణ క్యాడర్ రిటైర్డ్ ఐపీఎస్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టీడీపీలో చేరి బాపట్ల నుండి ఎంపీగా గెలిచారు. గ్రూప్ 1 అధికారిగా పని చేసిన తలారి రంగయ్య 2017లో వీఆర్‌ఎస్ తీసుకుని, 2019లో వైసీపీ తరఫున అనంతపురం లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించారు. ఈ విజయాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బ్యూరోక్రాట్లు స్థాపిత రాజకీయ పార్టీల బలంతోనే ఎక్కువగా రాణిస్తున్నారు తప్ప.. సొంత పార్టీ పెడితే మాత్రం ఘోరంగా దెబ్బతింటున్నారు. సొంతంగా పార్టీ నడపడం వారికి కత్తి మీద సాములా మారుతోంది.
బ్యూరోక్రాట్లు రాజకీయాల్లోకి రావడానికి కారణాలు వారి వ్యక్తిగత స్వభావం, వారి ఆకాంక్షలను బట్టి మారుతున్నాయి. కొందరు సేవా భావంతో, సంస్కరణల కోసం రాజకీయాలను ఎంచుకుంటే, మరికొందరు అధికార ఆకాంక్షతో ఈ బాట పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. సంపాదించుకున్న ఆస్తుల రక్షణ కోసం, రాజకీయ అండ కోసం పార్టీలలో చేరుతున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. తాజాగా పొలికల్ ఎంట్రీ ఇస్తానంటున్న ఏబీ వెంకటేశ్వరరావు ఎపిసోడ్ మాత్రం కాస్త భిన్నంగా అనిపిస్తుంది. ఆయన లక్ష్యం రివేంజ్ పాలిటిక్సా లేక ప్రజాసేవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్ హయాంలో ఏబీవీపై కక్ష సాధింపులు జరిగితే, చంద్రబాబు అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా సరైన న్యాయం చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏబీవీ రాజకీయ ఎంట్రీ… ఎవరికి నష్టం చేస్తుందనే చర్చ ఊపందుకుంది.
Also Read: Sajjala Ramakrishna Reddy: సజ్జలపై వారిలో ఇంత అక్కసా?
Second innings: ఇక మాజీ బ్యూరోక్రాట్ల రాజకీయ వైఫల్యాలకు అనేక కారణాలు కనిపిస్తాయి. మొదటిది, వారి భావజాలం సామాన్యులను ఆకట్టుకోవడంలో విఫలమవుతోంది. జేపీ, జేడీ లాంటి వారు యువతను తమ ప్రసంగాలతో ఆకర్షించినప్పటికీ, ఓట్లుగా మలచుకోలేకపోయారు. రెండవది, స్థాపిత పార్టీలతో పోలిస్తే, వీరి వద్ద బలమైన సంస్థాగత నిర్మాణం లేకపోవడం. మూడవది, ప్రజాకర్షక పథకాలు, ఆచరణీయ వాగ్దానాలు లేకపోవడం. దీనికి తోడు, రాజకీయాల్లో మునిగాక… అనివార్యంగా వచ్చే విమర్శలు, ఆరోపణలు వీరి గత పరిపాలనా గౌరవాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. ఉదాహరణకు అరవింద్ కేజ్రీవాల్ లాంటి సమర్థుడు, నిజాయితీపరుడైన బ్యూరోక్రాట్.. రాజకీయాల్లోనూ విజయం సాధించినప్పటికీ, వివాదాల నుంచి తప్పించుకోలేకపోయారు. ఆయనపై వచ్చిన లిక్కర్ స్కామ్ ఆరోపణలు… రాజకీయ అవినీతికి మాజీ బ్యూరోక్రాట్లు అతీతులు కారనే సందేశాన్ని ఇస్తున్నాయ్.
చివరగా, సివిల్ సర్వీసెస్‌లో దశాబ్దాల పాటు పనిచేసినా వ్యవస్థలో తీసుకురాలేని మార్పులను… రాజకీయాల ద్వారా సాధించాలనే ఆకాంక్ష కొందరిలో కనిపిస్తుంది. కానీ ఏదో ఒక పార్టీలో చేరి తమ మార్కును కోల్పోవడమో, సొంతంగా పార్టీ పెట్టి పూర్తిగా కనుమరుగవడమో జరుగుతోంది తప్ప.. రాజకీయాలు, ప్రజా జీవితాల్లో మార్పు తెచ్చిన మాజీలు చాలా అరుదు. కొద్దో గొప్పో సినీ తారలు రాజకీయాలను ప్రభావితం చేయగలుతున్నారు. రాజకీయాల్లో సినిమా స్టార్లు సాధించిన విజయాలతో పోలిస్తే, మాజీ బ్యూరోక్రాట్లు చాలావరకు వెనుకబడే ఉన్నారు. దీనికి కారణం… సివిల్ సర్వీస్‌లో కనబరిచిన నిబద్ధత, రాజకీయాల్లో కనబరచాల్సిన చాణక్యత మధ్య పొత్తు కుదరకపోవడమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

