Sai Rajesh: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తనయుడు బాబిల్ ఖాన్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. బాలీవుడ్ తీరును ఎండగడుతూ బాబిల్ చేసిన వీడియో వైరల్ కాగా, అతడి టీమ్ దానిపై క్లారిటీ ఇచ్చింది. బాబిల్ ఆవేదనను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించింది. అయితే, ఈ వివరణపై తెలుగు దర్శకుడు సాయి రాజేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ద్వారా తన నిరసన తెలిపిన ఆయన, “మమ్మల్ని పిచ్చోళ్లని అనుకున్నారా? బాబిల్ వీడియోలో ప్రస్తావించిన వారు మాత్రమే మంచోళ్లా? అతడికి సపోర్ట్ చేసిన మేమంతా పిచ్చివాళ్లమా?” అని ప్రశ్నించారు. సాయి రాజేశ్ మరింత ఆవేశంగా, “ఒక గంట ముందు వరకూ అతడికి సపోర్ట్ చేయాలనుకున్నా. కానీ, ఈ తీరు చూస్తే ఇక ఆగడమే మంచిది. సానుభూతి ఆటలు సాగవు. నిజాయతీగా క్షమాపణ చెప్పాలి” అని హితవు పలికారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బాబిల్ టీమ్ ఈ వివాదంపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
