War Begins Pak Reaction

War Begins Pak Reaction: పాక్‌ ఉగ్ర శిబిరాలపై భారత్‌ ‘సిందూర్‌’ సిరీస్

War Begins Pak Reaction: ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్థాన్‌కు భయం ఆవహించింది. ఈ ఆపరేషన్‌లో 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. భారత్‌ దాడులకు పాల్పడితే తమ వైపు నుంచి కూడా తక్షణ, నిర్ణయాత్మక స్పందన ఉంటుందని పాకిస్థాన్ సైనిక అధిపతి జనరల్ అసీమ్ మునీర్ హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే… ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతంగా చేపట్టి.. పాక్‌ హెచ్చరికల్ని గాలిలో కలిపేసింది భారత్‌. అయితే ఇప్పుడు పాక్‌ రియాక్షన్‌ ఎలా ఉండబోతోంది? ఇప్పటికే తన సైనిక స్థావరాల భద్రతను పటిష్ఠం చేసింది పాకిస్తాన్‌. రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంలో యుద్ధ విమానాలను మోహరించింది. పాకిస్థాన్ రియాక్షన్‌ ప్రధానంగా మూడు రూపాల్లో ఉండే అవకాశం ఉందని ఎక్స్‌పర్ట్స్‌ అంటున్నారు. ఒకటి సైనిక చర్య కాగా, మరొకటి దౌత్య పరమైన ఒత్తిడి. ఇక మూడోది సైబర్‌ యుద్దం.

ఎల్‌ఓసీ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరింత ఉల్లంఘిస్తూ, కప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో కాల్పులు లేదా మోర్టార్ దాడులు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే పూంచ్, రాజౌరిలో ఇలాంటి దాడులు జరిగాయి. ముగ్గురు పౌరులు మరణించినట్లుగా వార్తలొచ్చాయి. ఇక దౌత్యపరమైన ఒత్తిడిలో భాగంగా ఇప్పటికే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌తో మాట్లాడి, “తటస్థ విచారణ” కోరారు. సింధు జలాలను ఆపడాన్ని కూడా యుద్ధ చర్యగానే భావిస్తున్నట్లు పాక్‌ అంటోంది. ఇప్పుడు ఆపరేషన్‌ సిందూర్‌ని కూడా భారత యుద్ధ చర్యగానే ప్రచారం చేసుకుంటోంది. కానీ ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా భారత్‌ కేవలం ఉగ్రవాదులనే టార్గెట్‌ చేసింది. పాక్‌ పౌరులు కానీ, పాక్‌ ఆర్మీ కానీ తమ లక్ష్యం కాదని ఇస్లామిక్‌ దేశాలతో పాటూ ప్రపంచానికి స్పష్టంగా తెలియజేసింది. కానీ పాకిస్తాన్‌ వక్రీకరణలతో అంతర్జాతీయ సమాజంలో సానుభూతి పొందే ప్రయత్నం చేయవచ్చు. ఇక పాక్‌ చేయగలిగే మరో పని సైబర్ వార్‌. పాకిస్తాన్‌ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా భారత్‌పై విమర్శలు గుప్పిస్తోంది.

భారత్ విధించిన యూట్యూబ్, సోషల్ మీడియా నిషేధాలకు ప్రతిగా, సైబర్ దాడులు లేదా తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉంది. ఆపరేషన్‌ సిందూర్‌పై ఇప్పటికే వందలాది ఫేక్‌ పోస్టులు క్రియేట్‌ చేసి, భారత్‌పై నిందలు వేయాలని చూస్తోంది. అయితే భారత్‌ కూడా పాక్‌ సైబర్‌ దాడులకు ధీటుగా బదులిస్తోంది. ఇక యుద్ధానికి పాక్‌ సిద్ధపడుతుందా అంటే… ఆ దేశ ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా పూర్తి స్థాయి యుద్ధానికి పాక్‌ వెనుకాడొచ్చు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ దౌత్యపరమైన మార్గాలను సూచించారు, ఇది ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇక భారత్‌ మెరుపుదాడితో పాక్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ కాళ్ల బేరానికే వచ్చాడు. భారత్ దాడులు ఆపేస్తే.. తాము ఎలాంటి ప్రతీకారానికి దిగబోమని ప్రకటించాడు. రెండ్రోజుల క్రితం ఈయనే.. తమపై భారత్‌ దాడి చేస్తే ప్రపంచంలో ఎవరూ మిగలరంటూ పరోక్షంగా అణ్వస్త్ర హెచ్చరికలు చేశాడు. పాక్‌ రక్షణ మంత్రి మాటలను బట్టే తెలుస్తోంది… పాకిస్తాన్‌ పైకి మాట్లాడేవన్నీ ప్రగల్భాలేనని, దానికి అసలు యుద్ధం చేసే దమ్ము లేనే లేదని.

ALSO READ  Nizamabad: చరిత్రలో ఫస్ట్‌ టైమ్‌.. మంత్రి లేని నిజామాబాద్‌

Also Read: Masood Azhar: ఇక భారత్‌పై ఏమాత్రం జాలి చూపను.. మసూద్ అజార్ సంచలన లేఖ విడుదల

మరి ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ చర్యలు ఆగుతాయా? మరిన్ని సైనిక ఆపరేషన్స్ ఉంటాయా? ‘ఆపరేషన్ సిందూర్’ భారత్‌ దృఢమైన సైనిక సామర్థ్యాన్ని, ఉగ్రవాదంపై దీర్ఘకాలిక వ్యూహాన్ని చాటింది. అయితే, ఇది కేవలం ఒక ప్రతీకార చర్య మాత్రమే కాదు—ఇది భారత్ యొక్క భవిష్యత్ విధానాలకు ఒక సంకేతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, “ప్రతి ఉగ్రవాదిని, వారి మద్దతుదారులను గుర్తించి, ఊహించని విధంగా శిక్షిస్తామని” ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో, భారత్ ఇక్కడితో ఆగే అవకాశం తక్కువే అని తెలుస్తోంది. సిందూర్‌-2, సిందూర్‌-3.. ఇలా పాక్‌ ఉగ్ర శిబిరాలపై సిరీస్‌ ఆఫ్‌ ఆపరేషన్స్‌ చేపట్టవచ్చు. ఎన్‌ఐఏ దర్యాప్తులో దక్షిణ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు తెలిసింది. దీంతో ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు తీవ్రతరం కావచ్చు.

భారత్ ఇప్పటికే సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. పాక్ నుండి దిగుమతులపై నిషేధం విధించింది. అట్టారీ-వాఘా సరిహద్దును మూసివేసింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ -FATF గ్రే లిస్ట్‌లో పాకిస్థాన్‌ను చేర్చేందుకు అంతర్జాతీయ సమాజంతో చర్చలు జరుపుతోంది. అయితే, పూర్తి స్థాయి యుద్ధం ద్వైపాక్షిక ఉద్రిక్తతలను తీవ్రతరం చేస్తుందని ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ సంస్థ ఐరాస ఉద్రిక్తతలు తగ్గించాలని కోరుతోంది. అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ కూడా ఇంతటితో ముగించాలంటూ మాట్లాడారు. మొత్తంగా, ఏది ఏమైనా భారత్ తన చర్యలను ‘ఆపరేషన్ సిందూర్’తో ఆపే అవకాశం తక్కువే. ఉగ్రవాదుల లక్ష్యంగా గాలింపు చర్యలు, సర్జికల్ స్ట్రైక్స్ కొనసాగవచ్చు. కానీ పూర్తి స్థాయి యుద్ధం ఇప్పట్లో అసంభవమనే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.

ఇక యుద్ధం అనివార్యమైతే, తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఎలా ఉంటుంది? పాక్ టార్గెట్ ప్రాంతాలు, ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఏవి? అనేది ఒక సారి చూద్దాం. యుద్ధం అనివార్యమైతే, దాని ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లపై బహుముఖంగా ఉండే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాలు దేశ సరిహద్దు ప్రాంతాలు కాకపోయినా, వాటి ఆర్థిక, సామాజిక, వ్యూహాత్మక ప్రాముఖ్యత కారణంగా పాకిస్థాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. యుద్ధం వల్ల దేశవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలవచ్చు. దీంతో హైదరాబాద్‌లోని ఐటీ రంగం, విశాఖపట్నంలోని షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగాలు దెబ్బతినవచ్చు. ఇంధన ధరలు పెరగడం, రవాణా, సరఫరా చైన్‌ ఆటంకాలు సామాన్యుల జీవనాన్ని దెబ్బతీస్తాయి. సరిహద్దు రాష్ట్రాల నుండి వలసలు పెరిగితే, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో జనసాంద్రత పెరిగి, మౌలిక వసతులపై ఒత్తిడి పడొచ్చు. యుద్ధం నేపథ్యంలో మతపరమైన ఉద్రిక్తతలు, తప్పుడు ప్రచారాలు పెరిగే అవకాశం ఎక్కువ.

ALSO READ  Yashwant Varma: జస్టిస్‌ యశ్వంత్‌వర్మ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

Also Read: Deputy CM Pawan: ప్రధాని మోదీపై డిప్యూటీ సీఎం పవన్‌ ట్వీట్‌

ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో అప్రమత్తత అవసరం. పాకిస్థాన్ సైనిక దాడులకు బదులు… సైబర్ దాడులు, లేదా ఉగ్రవాద చర్యలకు పాల్పడవచ్చు. తద్వారా ఆర్థిక, వ్యూహాత్మక కేంద్రాలైన తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. భారత్‌లోని ప్రముఖ ఐటీ హబ్‌గా వెలుగొందుతున్న హైదరాబాద్ నగరం ఉగ్రవాదుల సైబర్ దాడులకు ప్రధాన టార్గెట్‌ కావొచ్చు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని సంస్థలు…. డేటా బ్రీచ్‌లు, రాన్సమ్‌వేర్ దాడులకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) వంటి సైనిక సంస్థలు ఉన్నందున హైదరాబాద్‌కు గూఢచర్యం లేదా ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి ఉంది.

ఇక తూర్పు తీరంలోని ప్రముఖ నౌకాదళ స్థావరం విశాఖపట్నం వ్యూహాత్మక భారత సైన్యానికి స్థావరంగా ఉంది. ఇక్కడ ఐఎన్‌ఎస్ విరాట్, ఐఎన్‌ఎస్ విక్రాంత్ వంటి యుద్ధనౌకలు ఉన్నాయి. దీంతో పాకిస్థాన్ నౌకాదళం లేదా ఉగ్రవాద సంస్థలు సముద్ర మార్గంలో దాడులు లేదా గూఢచర్యం చేసే అవకాశం ఉంది. ఇక తిరుపతి, గుంటూరు వంటి ప్రాంతాలు… పరిశ్రమలు, జనసాంద్రత కారణంగా ఉగ్రవాద దాడులకు లక్ష్యంగా మారవచ్చు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు వంటి రద్దీ ప్రాంతాలను టార్గెట్‌ చేయొచ్చు. అయితే తెలుగు రాష్ట్రాలు ఈ ముప్పును ఎదుర్కోవడానికి సన్నద్ధంగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో సైబర్ సెక్యూరిటీ టీమ్‌లు, విశాఖపట్నంలో నౌకాదళ రక్షణ వ్యవస్థలు బలంగా ఉన్నాయి. అయినప్పటికీ, రద్దీ ప్రాంతాల్లో నిఘా, ప్రజల్లో అప్రమత్తతను పెంచడం అవసరం.

‘ఆపరేషన్ సిందూర్’ భారత్‌ చేస్తోన్న ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో ఒక కీలక అడుగు. పాకిస్థాన్ నుండి సైనిక, దౌత్యపరమైన రియాక్షన్స్‌ రావచ్చు, కానీ ఆర్థిక పరమైన కారణాలు, అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా పూర్తి యుద్ధం అసంభవం. భారత్ తన సైనిక, దౌత్య చర్యలను కొనసాగించే అవకాశం ఉంది, కానీ జాగ్రత్తగా ముందుకు సాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రాంతాలు సైబర్, ఉగ్రవాద దాడులకు లక్ష్యాలుగా ఉన్నాయి, కానీ బలమైన రక్షణ వ్యవస్థలు ఈ ముప్పులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఉద్విగ్న సమయంలో, దేశ ప్రజలు ఐక్యంగా, అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే, భారత్‌ సంకల్పం ఒక్కటే: “ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సహించేది లేదు!”

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *