Azharuddin: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ అజహరుద్దీన్‌కు తెలంగాణ రాష్ట్ర మంత్రి పదవి దక్కింది. ఈ రోజు మధ్యాహ్నం 12.15 గంటల ప్రాంతంలో రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనతో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ విస్తరణలో భాగంగా అజహరుద్దీన్ ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు పలువురు మంత్రులు హాజరై, నూతన మంత్రికి తమ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ఆయనకు ఏ శాఖను కేటాయించనున్నారనే విషయంపై అధికారికంగా ఇంకా స్పష్టత రాలేదు.
మైనార్టీ వర్గానికి ప్రాధాన్యం
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై గత కొద్ది రోజులుగా ఏఐసీసీలో చర్చ జరిగింది. ప్రస్తుతం కేబినెట్‌లో 15 మంది మంత్రులు ఉండగా, మరో ముగ్గురికి అవకాశం ఉంది. ఈసారి, ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన అజహరుద్దీన్‌కు మాత్రమే మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. సాధారణంగా, రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ వర్గానికి ఒక మంత్రి పదవి ఉంటుంది. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆ వర్గం నుంచి ఎవరూ గెలవకపోవడంతో, ఇప్పటివరకు కేబినెట్‌లో వారికి ప్రాతినిధ్యం దొరకలేదు.
ఎమ్మెల్సీ కాకముందే మంత్రి
గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి అజహరుద్దీన్ ఓడిపోయారు. తాజాగా జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆయన పోటీకి సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. గవర్నర్ కోటా కింద అజహరుద్దీన్‌తో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ను ఎమ్మెల్సీలుగా నియమించాలని ప్రభుత్వం గవర్నర్‌కు సిఫారసు చేసింది. అయితే, వీరి నియామకానికి గవర్నర్ ఆమోదం ఇంకా తెలుపనప్పటికీ, ఎమ్మెల్సీ నియామక ప్రక్రియ పూర్తికాకముందే మంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


