Ayodhya:ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ బుధవారం కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉత్తరప్రదేశ్ రాజధాని నగరమైన లక్నోలోని ఎస్‌జీపీజీఐలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బీపీ షుగర్‌తో బాధపడుతున్న ఆయన ఇటీవలే ఆ ఆసుపత్రిలో చేరారు.
Ayodhya:ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో వారం రోజులుగా ఆసుపత్రిలోనే ఆచార్య సత్యేంద్రదాస్ మృత్యువుతో పోరాడారు. చివరికి బుధవారం ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఆచార్య సత్యేంద్రదాస్ అంత్యక్రియలు అయోధ్యలోని సరయూ నది ఒడ్డున నిర్వహించనున్నట్టు ఆయన శిష్యుడు ప్రదీప్‌దాస్ మీడియాకు వెల్లడించారు.
Ayodhya:అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ మృతి నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలు సంతాపం తెలిపారు. ఆయన మృతితో ఆలయ పరిధిలో విషాదం అలుముకున్నది. తోటి పూజారులు విషాదవదనంలో మునిగిపోయారు.
Ayodhya:ఆచార్య సత్యేంద్రదాస్ 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలోనూ రామమందిరానికి తాత్కాలిక పూజారిగా కొనసాగారు. ఆ సమయంలో మందిరంలోని విగ్రహాలను సమీపంలోని పకీర్ మందిరంలోనికి తీసుకెళ్లారు. కూల్చివేతల అనంతరం విగ్రహాలను మళ్లీ రామమందిరానికి తీసుకొచ్చారు.
Ayodhya:ఆచార్య సత్యేంద్రదాస్ తన 20 ఏళ్ల వయసులోని నిర్వాణి అఖాడాలో సభ్యుడిగా చేరి ఆధ్యాత్మిక దీక్ష చేపట్టారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ సందర్భంగా ప్రాణప్రతిష్ట సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత నుంచి రామాలయం ప్రధాన పూజారిగా కొనసాగుతూ వచ్చారు.

