Axar Patel

Axar Patel: టీమిండియాకు షాక్.. పాక్‌తో మ్యాచ్‌కు అక్షర్ దూరం?

Axar Patel: ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లలో భాగంగా ఇండియా, పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్ 21) దుబాయ్ వేదికగా ఈ దాయాది జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతున్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. సూపర్-4 దశలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడంతో విజయం కోసం ఇరు జట్లు తీవ్రంగా కృషి చేయనున్నాయి. బలమైన భారత జట్టుపై విజయం సాధించి టోర్నీలో నిలదొక్కుకోవాలని పాకిస్తాన్ చూస్తుంటే, ఇండియా మరోసారి ఆధిపత్యాన్ని చూపాలని పట్టుదలతో ఉంది.

అక్షర్ పటేల్ దూరం?
ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఒక చెడు వార్త ఎదురైంది. జట్టులోని కీలకమైన స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం (సెప్టెంబర్ 19) ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అక్షర్ తలకు గాయమైంది. ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో వెనుకకు పడిపోవడంతో అతని తల నేలకు బలంగా తగిలింది. దీంతో మైదానంలో ఇబ్బంది పడిన అక్షర్ వెంటనే డగౌట్‌కు వెళ్ళిపోయాడు. అక్షర్ గాయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు, కానీ ఒక్క రోజులో అతను కోలుకుని రేపు మ్యాచ్ ఆడటం అనుమానమే.

Also Read: Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్‌గా

జట్టులో మార్పులు తప్పవా?
ఒకవేళ అక్షర్ పటేల్ మ్యాచ్‌కు దూరమైతే అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారనే చర్చ మొదలైంది. స్పెషలిస్ట్ బ్యాటర్‌ను తీసుకువస్తారా లేక స్పెషలిస్ట్ బౌలర్‌కు అవకాశం ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. జట్టులో ఇప్పటికే కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి రూపంలో బలమైన స్పిన్ బౌలర్లు ఉన్నారు కాబట్టి, స్పెషలిస్ట్ బ్యాటర్‌కు అవకాశం దక్కవచ్చు.

అదే జరిగితే, మిడిల్ ఆర్డర్‌లో జితేష్ శర్మకు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, ఒమన్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నారు. కాబట్టి, అర్షదీప్ స్థానంలో బుమ్రా, అక్షర్ స్థానంలో వరుణ్ చక్రవర్తి జట్టులోకి రావచ్చని కూడా ఒక అంచనా ఉంది. ఏదేమైనా, ఈ కీలక మ్యాచ్‌కు ముందు అక్షర్ గాయం భారత జట్టు కూర్పును ప్రభావితం చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *