Avinash: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయంపై వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. నిజమైన ఓటర్లను పోలింగ్ బూత్‌లలోకి వెళ్లనివ్వలేదని ఆరోపించిన ఆయన, “దీన్ని ఎవరైనా ఎన్నిక అంటారా?” అంటూ మండిపడ్డారు.
“మీరు గెలిచామనుకుంటున్నారు కానీ ప్రజలు అలా అనుకోవడం లేదు. ప్రజలు ఓటు వేస్తేనే గెలిచామని చెప్పుకోవచ్చు. మీకోసం దొంగ ఓటర్లు వేసిన ఓటుతో గెలిచారని మీరు అనుకుంటున్నా, వారికే మీరు గెలిచారని భావన లేదు” అని అవినాశ్ ఎద్దేవా చేశారు.
ఈ ఫలితాలతో వైసీపీ కార్యకర్తలు నిరుత్సాహపడవద్దని సూచించిన ఆయన, “ప్రజలు గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. అప్పటికి మేము ఎప్పటిలాగే నిజమైన ఓటింగ్ ద్వారా మీకు గుణపాఠం చెబుతాం, దొంగ ఓట్లతో కాదు” అని స్పష్టం చేశారు.