Auto Drivers Scheme

Auto Drivers Scheme: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం.. నేడే ఖాతాల్లోకి రూ.15 వేలు జ‌మ‌

Auto Drivers Scheme: ఆంధ్రప్రదేశ్‌లో ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఊరట కల్పించింది. స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడంతో ఆదాయం తగ్గి ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లకు అండగా నిలుస్తూ ‘ఆటో డ్రైవర్ల సేవలో’ అనే కొత్త పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తోంది.

ఈ రోజు (శనివారం) ఉదయం 11 గంటలకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం వేదికగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరవుతున్నారు. ప్రత్యేక ఆకర్షణగా వీరంతా ప్రకాశం బ్యారేజీ నుంచి ఆటోల్లో వచ్చి సభ వేదికకు చేరుకోనున్నారు.

ప్రతి డ్రైవర్‌కు రూ.15 వేల సాయం

ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది డ్రైవర్లు అర్హులుగా ఎంపికయ్యారు. ఒక్కో డ్రైవర్‌కు రూ.15,000 చొప్పున మొత్తం రూ.436 కోట్లు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందులో ఆటో డ్రైవర్లు 2,64,197 మంది, క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది ఉన్నారు.

అత్యధిక లబ్ధిదారులు విశాఖపట్నం జిల్లా నుంచి ఉన్నారు. అక్కడ మొత్తం 22,955 మంది డ్రైవర్లు ఈ పథకంతో ప్రయోజనం పొందనున్నారు.

ఎన్నికల హామీ కాకపోయినా

ఆటో డ్రైవర్ల ఆర్థిక సాయంపై కూటమి మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదు. అయినప్పటికీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన తరువాత డ్రైవర్ల సమస్యలు పెరగడంతో, వారిని ఆదుకోవడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది. దసరా సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

గత వైకాపా ప్రభుత్వంలో ‘వాహన మిత్ర’ పేరిట డ్రైవర్లకు రూ.10,000 చొప్పునే సాయం ఇచ్చారు. అది కూడా 2.61 లక్షల మందికే పరిమితమైంది. ఇక కూటమి సర్కారు మాత్రం 2.90 లక్షల మందికి రూ.15,000 చొప్పున అందిస్తోంది.

ఇది కూడా చదవండి: Vijay Deverakonda-Rashmika: విజయ్ దేవరకొండ- రష్మిక సీక్రెట్ ఎంగేజ్మెంట్

బీసీ లబ్ధిదారులే అధికం

మొత్తం 3.23 లక్షల దరఖాస్తులు వచ్చినప్పటికీ పరిశీలన అనంతరం 2,90,669 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో:

  • బీసీలు – 1,61,737 మంది

  • ఎస్సీలు – 70,941 మంది

  • ఎస్టీలు – 13,478 మంది

  • కాపులు – 25,801 మంది

  • రెడ్లు – 7,013 మంది

  • ఈబీసీలు – 4,186 మంది

  • మైనార్టీలు – 3,867 మంది

  • కమ్మలు – 2,647 మంది

  • క్షత్రియులు – 513 మంది

  • బ్రాహ్మణులు – 365 మంది

  • ఆర్యవైశ్యులు – 121 మంది

ఈ ఆర్థిక సాయం ముఖ్యంగా కుటుంబ పోషణలో కష్టాలు ఎదుర్కొంటున్న డ్రైవర్లకు పెద్ద ఊరటనిస్తుందని ప్రభుత్వం నమ్ముతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *