Huzurabad: మొన్నటికి మొన్న పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భవతులు డెలివరీ కోసం ఆసుపత్రి రాగా వారికి మత్తు డాక్టర్ లేక ఆపరేషన్ నిలిచి ఇబ్బంది పడ్డ గర్భిణీ స్త్రీల సమస్యలపై వార్తలలో వచ్చి మరువకముందే మరొక ఘటన వెలుగులోకి వచ్చింది.ఎప్పుడు చూసినా ఏదో ఒకరకంగా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వార్తల్లో నిలుస్తుంది.
గుర్తు తెలియని మహిళ ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం పక్కన మహిళల మరుగుదొడ్ల వద్ద అప్పుడే అబార్షన్ చేసిన ఆడ శిశువును బాత్రూంలో వదిలేసి వెళ్లడం కలకలం సృష్టించింది. సుమారు 9:30 ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ బాత్రూం లోపలికి వెళ్లి అక్కడే అబార్షన్ చేసి తీసిన శిశువును వదిలేసి వెళ్లడం బాత్రూం వెళ్లిన మహిళల కంటపడింది. దీంతో ఈ విషయం వైద్యుల దృష్టికి తీసుకురాగా వారు పరిశీలించి పోలీసులకు వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు.
అయితే ఆ శిశువు మా ఆస్పత్రిలో ఏలాంటి డెలివరీలు కానీ అబార్షన్ కానీ చేయలేదని.. వేరే ఎక్కడినుండో తీసుకువచ్చి గుర్తు తెలియని మహిళ ఇక్కడ వదిలేసి ఉంటుందని డ్యూటీ వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలియగానే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు సంఘటన స్థలానికి చేరుకొని సిసి ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు.