Atishi: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆతిశీ ఆదివారం రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాకు తన రాజీనామా లేఖను ఆమె సమర్పించారు. శనివారం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అధికారాన్ని దక్కించుకోగా, ఆప్ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలోనే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమై ఒక్క స్థానంలోనూ గెలుపొందలేక చతికిలపడింది.
Atishi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి అయిన ఆతిశీ కాల్కాజీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రౌండ్లవారీగా ఫలితాల వెల్లడి సమయంలో ఆమె ఓ దశలో వెనుకంజలో ఉన్నారు. ఆ తర్వాత రౌండ్లలో పుంజుకొని బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరిపై 3,521 ఓట్ల తేడాతో ఆతిశీ విజయం సాధించారు. ఇదే ఎన్నికల్లో ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సహా కీలక నేతలైన మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ ఓటమి పాలయ్యారు.
Atishi: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండగానే అర్వింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవించారు. నిరుడు సెప్టెంబర్ నెలలో ఆయన బయటకు వచ్చారు. అప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగానే ఉన్నారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చాక తన పదవికి రాజీనామా చేశారు. ప్రజలు మళ్లీ తనకు విశ్వసనీయతను గుర్తించే వరకూ తాను పదవిలో ఉండబోనని పేర్కొంటూ ఆతిశీని ఢిల్లీ నూతన సీఎంగా ప్రతిపాదించారు. అప్పటి నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఆతిశీనే ముఖ్యమంత్రిగా కొనసాగారు.
Atishi: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఆప్ పార్టీకి ఎదురుదెబ్బేనని ఆతిశీ ఓటమి అనంతరం మాట్లాడుతూ చెప్పారు. తనపై నమ్మకంతో తనను గెలిపించినందుకు కాల్కాజీ ఓటర్లకు ఆమె తన కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు చేపట్టనున్న బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు చేపడితే ప్రజల తరఫున పోరాడుతామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు.