AP Assembly: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభమయ్యాయి. మొదటి రోజే మండలిలో గట్టి వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రైతాంగ సమస్యలు, యూరియా కొరత అంశంపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం పెట్టారు. అయితే మండలి చైర్మన్ ఆ తీర్మానాన్ని తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చూపిస్తూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది.
ఈ సందర్భంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ “ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది. యూరియా కొరత నుంచి రైతుల సమస్యల వరకు ప్రతి అంశాన్ని సభ ముందు ఉంచుతాం. ప్రజలకు స్పష్టత ఇవ్వడం మా బాధ్యత” అని అన్నారు. బీఏసీ సమావేశం అనంతరం సమగ్ర చర్చ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: AP Assembly: టిడ్కో ఇళ్ల పై ఎమ్మెల్యే విష్ణుకుమార్ కామెంట్స్.. సమాధానం చెప్పిన నారాయణ
విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాత్రం వెంటనే చర్చ జరపాలని పట్టుబట్టారు. ఆయన మాట్లాడుతూ “రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. చర్చకు ప్రభుత్వం సిద్ధమైతే ఆలస్యం ఎందుకు? ఇప్పుడే చర్చిస్తే రైతులకు న్యాయం జరుగుతుంది” అని ప్రశ్నించారు.
దీనికి ప్రతిస్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు “రైతులకు గిట్టుబాటు ధరల కోసం, పంట సమస్యల పరిష్కారానికి ఏం చేశామో సభ ద్వారా వివరిస్తాం. ఏ ప్రభుత్వం ఎంత చేసింది అన్నది కూడా చర్చిస్తాం. నిర్ణయం బీఏసీ ఆధారంగానే ఉంటుంది” అని స్పష్టం చేశారు.
అయితే బొత్స మరోమారు తిప్పికొడుతూ “రైతుల తరపున మేము మాట్లాడుతున్నాం. రేపటిదాకా ఎందుకు వేచి చూడాలి? ఈరోజే చర్చిస్తే తప్పేముంది?” అని డిమాండ్ చేశారు.