AtchanNaidu: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న పర్యటనలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యమైతే జగన్ వ్యవసాయ పండితులను, రైతులను కలిసి మాట్లాడాల్సిందని అన్నారు. కానీ ఐదారు జిల్లాల నుంచి జనసమూహాన్ని తరలించడం, రోడ్డుపై మామిడి పండ్లు పోశించి దృశ్యాలను సృష్టించడం అనేది “సినిమా సెట్టింగ్‌లా” ఉందని విమర్శించారు.
బుధవారం జరిగిన కేబినెట్ సమావేశానంతరం మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్‌లతో కలిసి మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు, జగన్ యాత్రలు రాష్ట్రంలో శాంతిభద్రతలను అస్తవ్యస్తం చేయడమే లక్ష్యంగా ఉన్నాయన్న ఆరోపణలు చేశారు. “ఇది క్రిమినల్ మైండ్‌తో చేసే పని. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలాంటి చర్యలు చేయడం సమాజానికి తప్పు సందేశం ఇస్తోంది” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తోతాపురి మామిడి సమస్యపై స్పష్టత
తోతాపురి మామిడి రైతుల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికే స్పందించిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది ఏకంగా 7 లక్షల మెట్రిక్ టన్నుల పంట వచ్చిందని, కానీ గతేడాది పల్ప్ పరిశ్రమల వద్ద నిల్వలు ఉండటంతో ధరలు పడిపోయాయని వివరించారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలతో చర్చించి, కిలో మామిడిని రూ.8కి కొనుగోలు చేయించేలా ఒప్పించామని పేర్కొన్నారు. రైతులపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం రూ.4 చొప్పున సహాయం అందిస్తోందని వెల్లడించారు.
ఇప్పటికే అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభమైనట్లు చెప్పారు. అయినప్పటికీ జగన్ యాత్రలు కొనసాగించడమే ఆయన దురుద్దేశాన్ని బట్టబయలుచేస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావకుండా చేయాలన్నదే జగన్ లక్ష్యంగా ఉన్నారని ఆయన ఆరోపించారు.
