Atchanaidu: శ్రీకాకులం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో యువత భవిష్యత్తు కోసం చేపట్టిన ‘అభ్యుదయం సైకిల్ యాత్ర’లో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభ్యుదయం సైకిల్ యాత్రలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్త చేశారు
కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ సైకిల్ యాత్రలో జిల్లా ఎస్పీ, ఎన్డీయే కూటమి నేతలు, విద్యార్థులు, యువతతో కలిసి తాను స్వయంగా సైకిల్ తొక్కినట్లు మంత్రి తెలిపారు. యువతలో అవగాహన పెంపొందించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ విలువైన జీవితాలను, తల్లిదండ్రుల కలలను నాశనం చేసుకోవద్దని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. మత్తు పదార్థాలు యువత జీవితాన్ని చీకటిమయం చేస్తాయని, వాటికి దూరంగా ఉండడమే నిజమైన అభివృద్ధి మార్గమని అన్నారు.
ఆరోగ్యవంతమైన, వ్యసన రహిత ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేసిన మంత్రి, ప్రతి ఒక్కరూ “డ్రగ్స్ వద్దు బ్రో” (#SayNoToDrugs) అనే నినాదాన్ని గుండెల్లో నింపుకుని సమాజ మార్పులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మన రాష్ట్రాన్ని మత్తు రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

