Telangana News: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే నిన్న ఐదుగురికి నోటీసులు అందగా, మిగిలిన ఐదుగురికి ఇవాళ్టి లేదా రానున్న రోజుల్లో ఇవ్వనున్నట్లు సమాచారం.
సుప్రీంకోర్టు ఆదేశాలపై చర్య
పార్టీ ఫిరాయింపు కేసుల్లో ఆలస్యం చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేసి, తుది నిర్ణయం ఇవ్వాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ న్యాయ నిపుణులు, అడ్వొకేట్ జనరల్‌తో చర్చించి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పందన
నోటీసులు అందుకున్న వారిలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ,
“తాను అసలు పార్టీ మారలేదని, ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నానని” స్పష్టం చేశారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. త్వరలోనే నోటీసులకు సమాధానం ఇస్తానని చెప్పారు.
ఇది కూడా చదవండి: Traffic Challan Rule: చలాన్ కట్టలేదా.. ఇపుడు వాటికీ కూడా చలాన్ కటాలసిందే..
ఇంకా నోటీసు రాని ఎమ్మెల్యేలు
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు ఇంకా నోటీసులు రాలేదు. బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన ఆయన, ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నప్పటికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో, ఆయన్ను నోటీసుల జాబితాలో చేర్చుతారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.
అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల జాబితా
బీఆర్‌ఎస్ ఫిర్యాదు మేరకు నోటీసులు అందుకున్న లేదా అందుకోబోతున్న ఎమ్మెల్యేలు:
-
పోచారం శ్రీనివాస్ రెడ్డి
-
కడియం శ్రీహరి
-
దానం నాగేందర్
-
సంజయ్ కుమార్
-
తెల్లం వెంకట్రావు
-
కృష్ణమోహన్ రెడ్డి
-
మహిపాల్ రెడ్డి
-
అరెకపూడి గాంధీ
-
కాలె యాదయ్య
-
ప్రకాశ్ గౌడ్
ఇకపై ఏం జరుగుతుంది?
స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యేల సమాధానాల తర్వాత విచారణ ప్రారంభం కానుంది. ఒకవేళ విచారణను ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తే, ఆ ఎమ్మెల్యేలపై ప్రతికూల నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇప్పటికే హెచ్చరించింది.
ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్‌ఎస్‌లోకి చేరతారా? లేక రాజీనామా చేసి కొత్త రాజకీయ భవిష్యత్తు కోసం అడుగులు వేస్తారా? అన్నది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
