Asia Cup: శ్రీలంక యువ క్రికెటర్ దునిత్ వెల్లలాగే తండ్రి సురంగ వెల్లలాగే ఆసియా కప్ 2025లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ మధ్యలో గుండెపోటుతో మరణించారు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన కీలకమైన ఆసియా కప్ మ్యాచ్‌లో దునిత్ వెల్లలాగే మైదానంలో ఉండగా, కొలంబోలో ఉన్న అతని తండ్రి సురంగ వెల్లలాగే మరణించారు. ఈ విషాదకరమైన వార్తను మ్యాచ్ జరుగుతున్నంత సేపు వెల్లలాగేకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. శ్రీలంక జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన తర్వాత, జట్టు కోచ్ సనత్ జయసూర్య, మేనేజర్ అతనికి ఈ విషయాన్ని తెలియజేశారు.
ఇది కూడా చదవండి: Trump-Modi: వచ్చే నెలలో మోదీ-ట్రంప్ భేటీ..?
ఈ విషయం తెలిసిన తర్వాత వెల్లలాగే తీవ్ర దుఃఖానికి గురయ్యాడు. జయసూర్య అతని భుజంపై చేయి వేసి ఓదార్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోనీ స్పోర్ట్స్ తరఫున కామెంటరీ చేస్తున్న మాజీ శ్రీలంక క్రికెటర్ రస్సెల్ ఆర్నాల్డ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. దునిత్ తండ్రి సురంగ కూడా ఒకప్పుడు క్రికెటర్ అని, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజీకి కెప్టెన్‌గా వ్యవహరించారని తెలిపారు. ఈ విషాద ఘటన కారణంగా, ఆఫ్ఘనిస్తాన్పై లభించిన విజయాన్ని శ్రీలంక జట్టు సంబరాలు చేసుకోలేదు. ఈ సంఘటన తర్వాత వెల్లలాగే వెంటనే శ్రీలంకకు తిరిగి వెళ్ళిపోయారు. అతని తదుపరి మ్యాచ్‌లలో పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది.