Ashok Gajapathi Raju

Ashok Gajapathi Raju: గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు: ఈ నెల 26న ప్రమాణ స్వీకారం

Ashok Gajapathi Raju: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ నెల 26న ఆయన గోవా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం తన పార్టీ సభ్యత్వానికి, పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు తన రాజీనామా లేఖను పంపినట్లు తెలిపారు.

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ నెల 21న ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకుందామని తనను కోరినట్లు అశోక్ గజపతి రాజు వెల్లడించారు. అయితే, తెలుగు వారికి శుభప్రదమైన శ్రావణ మాసంలోనే ప్రమాణ స్వీకారం చేయడం ఆచారంగా వస్తుందని, అందుకే ఈ నెల 26న కార్యక్రమం పెట్టుకుందామని సూచించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గోవా రాజ్‌భవన్ వర్గాలకు, కేంద్ర హోం శాఖకు కూడా తెలియజేయగా, వారు కూడా శ్రావణ మాసంలోనే ప్రమాణ స్వీకారం చేయడానికి అంగీకరించినట్లు అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు.

Also Read: ED: బెట్టింగ్‌ యాప్‌ కేసు.. గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు

సుదీర్ఘకాలం పాటు కొనసాగిన పార్టీకి రాజీనామా చేయడం బాధాకరంగా ఉందని పూసపాటి అశోక్ గజపతి రాజు భావోద్వేగానికి లోనయ్యారు. “పసుపు రంగు పవిత్రతకు ప్రతిరూపం, ఆ పవిత్రతను కాపాడేలా పనిచేస్తాను” అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తన రాజీనామా విషయంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఫోన్‌లో మాట్లాడి ఆమోదం తీసుకున్నట్లు వెల్లడించారు. రాజీనామా చేయడానికి ముందు ఆయన కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోనే ఆయన తన రాజీనామా పత్రాలపై సంతకాలు చేశారు.

అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియామకం, టీడీపీకి రాజీనామా చేయడం వంటి పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం ఆయనకు గవర్నర్ పదవిని కట్టబెట్టడం, దానికి ఆయన అంగీకరించి టీడీపీ నుంచి వైదొలగడంపై విశ్లేషణలు జరుగుతున్నాయి. శుక్రవారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా అశోక్ గజపతి రాజును కలిసి గోవా గవర్నర్‌గా నియామకంపై అభినందనలు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *