Asha Workers Protest: ఆంధ్ర ప్రదేశ్ లోని ఆశా వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం విశాఖపట్నంకు తరలివెళ్లారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత, అనేక ఇతర సమస్యల పరిష్కారం కోసం ‘ఛలో విశాఖ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే, రైలు మార్గాల్లో, బస్టాండ్‌ల వద్ద పోలీసులు భారీగా మోహరించి, వందలాది ఆశా వర్కర్లను అడ్డుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకొని, తిరిగి స్వస్థలాలకు పంపించారు.
ఇటీవల ప్రభుత్వం వయోపరిమితిని పెంచి, మెటర్నిటీ లీవ్ లు మంజూరు చేసినప్పటికీ, కనీస వేతనాల పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల ఆశా వర్కర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలను పోషించేందుకు తగినంత వేతనం లేకపోవడంతో, పదిహేను వందల మంది ఆశా వర్కర్లు రోడ్లెక్కారు.
ఇది కూడా చదవండి: Half Day Schools: పాఠశాల విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచే ఒంటిపూట బడులు
విశాఖలోని RTC కాంప్లెక్స్ వద్ద భారీగా ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపే వరకు పోరాటాన్ని విరమించబోమని స్పష్టం చేశారు. కొత్త టెక్నాలజీకి అనుగుణంగా తమ పనికోసం ఇచ్చిన ఫోన్లు అప్‌గ్రేడ్ చేయాలని, రికార్డు నిర్వహణ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నిరసనల నేపథ్యంలో నగరవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భద్రతను పెంచారు. డ్రోన్ల ద్వారా వర్కర్ల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. రహదారులు దిగ్బంధం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ నిరసనపై ఎలా స్పందిస్తుందో అనే ఆసక్తి నెలకొంది.