Asara Pension: సామాజిక పింఛన్ల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో ఇప్పటివరకు వేలిముద్రల ద్వారా ఆసరా పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ఇక నుంచి షేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నూతన యాప్‌ను రూపొందించింది. వచ్చే మే లేదా జూన్ నెల నుంచి ఈ విధానాన్ని ప్రారంభించనున్నది.
Asara Pension: ఆసరా పథకం కింద రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ, గీత కార్మికులు, డయాలసిస్, పైలేరియా, హెచ్ఐవీ బాధితులకు పింఛన్లను అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 42.96 లక్షల మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో సాధారణ పింఛన్ కింద రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున పింఛన్ సొమ్మును అందజేస్తున్నారు.
Asara Pension: ఊరూరా వీరిలో చాలా మందికి వేలిముద్రలు పడకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు, పోస్టుమాస్టర్లు, బిల్ కలెక్టర్లు ధ్రువీకరిస్తూ పింఛన్ల సొమ్మును అందజేస్తున్నారు. ఈ విధానం లోపభూయిష్టంగా ఉండటంతోపాటు అనేక అవకతవకలు జరిగే అవకాశం ఉన్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ దశలో ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ విధానం తేవాలని నిర్ణయించింది. ఈ మేరకు నూతన యాప్‌ను రూపొందించారు.
Asara Pension: ఇక నుంచి ఈ ఫేషియల్ విధానంలోనే పింఛన్ లబ్ధిదారుల ముఖ గుర్తింపుతో పింఛన్ సొమ్మును నెలనెలా అందజేయనున్నారు. ముఖ్యంగా వేలిముద్రలు పడని వృద్ధులకు సమస్యలు తీరనున్నాయి. నిత్యం పనులు చేసే వారిలో ఇతర క్యాటగిరీల వారిలో చాలా మందికి కూడా ఈవేలిముద్రల సమస్య వేధిస్తున్నది. ఇక నుంచి ఆసమస్య నుంచి వారు బయటపడనున్నారు.