Asaduddin owaisi: ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా జరిపిన వైమానిక దాడులపై AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను సాక్షాత్తుగా ఉల్లంఘిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
“గాజాలో జరుగుతున్న పాలస్తీనీయుల మారణహోమాన్ని ప్రపంచం దృష్టికి రాకుండా కప్పిపుచ్చేందుకే అమెరికా ఈ దాడులకు పాల్పడుతోంది” అని ఒవైసీ మండిపడ్డారు.లాంటి దాడులతో ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఆపుతుందని భావించడం అవాస్తవమని స్పష్టం చేశారు.
అమెరికా రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించారు:
ఒవైసీ పేర్కొన్న ముఖ్యమైన అంశం ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు కాంగ్రెసు అనుమతి లేకుండా ఏ దేశంపైనా దాడి చేయకూడదని తమ రాజ్యాంగమే చెబుతుందని గుర్తుచేశారు.”ఇది కేవలం అంతర్జాతీయ న్యాయపద్ధతులకే కాదు, అమెరికా రాజ్యాంగానికి కూడా ఎదురుదెబ్బ” అని విమర్శించారు.
ఇజ్రాయెల్ విషయంలో అమెరికా మౌనం ఎందుకు?
ఇజ్రాయెల్ దగ్గర 700–800 అణు వార్‌హెడ్‌లు ఉన్నా, ఎన్‌పీటీ ఒప్పందంపై సంతకం చేయకపోయినా, IAEA తనిఖీలు జరగనివ్వకపోయినా, అమెరికా మాత్రం మౌనంగా ఉండటం ద్వంద్వ వైఖరినే సూచిస్తున్నదని ఒవైసీ ఎత్తిచూపారు.
“ఇరాన్ అణుపరిశోధనలకు ఎన్‌పీటీపై సంతకాలు ఉన్నప్పటికీ ఇలా దాడులు చేస్తే భవిష్యత్‌లో వారు ఒప్పందాల నుంచి వెనక్కి తగిలే అవకాశం ఉంది” అని చెప్పారు.
అరబ్ ప్రపంచంలో కొత్త ప్రమాదకర మార్పులు:
ఇలాంటి దాడులతో ఇప్పుడు ఇతర అరబ్, ముస్లిం దేశాలు కూడా తమ భద్రత కోసం అణ్వాయుధాల గణనీయతను పునర్మూల్యాంకనం చేయవచ్చని ఆయన హెచ్చరించారు.”మీరు వారిని ఆపలేరు, ఇది భవిష్యత్ యుద్ధానికి నాంది కావచ్చు” అని ఆందోళన వ్యక్తం చేశారు.
భారతీయుల భద్రతపై ఆందోళన:
మధ్యప్రాచ్యంలో సుమారు 60 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారని, అక్కడ భారత కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని, వారు పంపే విదేశీ మారకద్రవ్యాన్ని దేశ ఆర్థిక వ్యవస్థ ఆదరిస్తోందని గుర్తుచేశారు. యుద్ధం వచ్చినట్లయితే ఈ ప్రజల భద్రత ప్రమాదంలో పడుతుందని అన్నారు.
పాకిస్థాన్‌పై సెటైర్లు:
ఒవైసీ తన పాకిస్థాన్‌పై కూడా వ్యంగ్యంగా విరుచుకుపడ్డారు.”ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఇస్లామాబాద్ డిమాండ్ చేస్తోందా? అదే కారణంగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుడితో కలిసి భోజనం చేశాడా?” అని ఘాటుగా ప్రశ్నించారు.