Arvind Dharmapuri: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Dharmapuri Arvind) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం నిజామాబాద్‌లో పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు, ఆరు గ్యారంటీల అమలు, పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీసీ రిజర్వేషన్లు ఒక ‘పొలిటికల్ డ్రామా’!
తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం కేవలం ‘పొలిటికల్ డ్రామా’ మాత్రమేనని ఎంపీ అరవింద్ కొట్టిపారేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదంతా ‘దొంగ డ్రామా’ అని మండిపడ్డారు.
42 శాతం రిజర్వేషన్‌లో సగం కూడా బీసీలకు ఇవ్వలేకపోయారు. దీనిని బట్టే కాంగ్రెస్ దొంగ డ్రామాలు బయటపడ్డాయి, అని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సరిగా ఇవ్వని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం… బీసీలకు రిజర్వేషన్లు ఇస్తుందని అనుకోలేం, అని ఎద్దేవా చేశారు.
ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలం
తెలంగాణలో అధికారం చేపట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఎంపీ అరవింద్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీలు అమలు చేయలేక చేతులెత్తేశారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.
ఇది కూడా చదవండి: Hong Kong Fire Accident: చరిత్రలోనే భారీ అగ్ని ప్రమాదం.. 44 మంది మృతి.. 279 మంది మిస్సింగ్..
కేంద్ర నిధుల కోసమే సర్పంచ్ ఎన్నికలు
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కూడా ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలను నిర్వహిస్తోందని ఆరోపించారు.
కేంద్రం నుంచి పావలా వడ్డీకే నిధులు అందుబాటులో ఉన్నాయి. ఆ నిధులతో గ్రామాల అభివృద్ధి పనులను ఎందుకు చేయడం లేదు? రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కేవలం కేంద్ర నిధులతోనే జరుగుతోంది, అని ఆయన స్పష్టం చేశారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని జోస్యం చెప్పారు.
రైల్వే పనులకు నిధులు విడుదల: డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు
నిజామాబాద్ జిల్లా రైల్వే పనులకు నిధులు విడుదల చేసినందుకు ఎంపీ అరవింద్.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రైల్వే పనులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానని తాను గతంలో ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. నిజామాబాద్ జిల్లాలో 10 ఆర్వోబీలను (రోడ్ ఓవర్ బ్రిడ్జెస్) పూర్తి చేయాలనేది తన ప్రధాన లక్ష్యం అని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.

