Arogyasri:తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ రోజు (సెప్టెంబర్ 16) అర్ధరాత్రి 11.59 నుంచి సేవలను నిలిపివేస్తున్నట్టు ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. మొత్తం బకాయిలు విడుదల చేసేంత వరకూ సేవలను కొనసాగించేది లేదని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టంచేశారు. ఇప్పటికే పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల కోసం ప్రభుత్వం ఒత్తిడి తేగా, కొంత బకాయిలు చెల్లిస్తామన్న హామీతో కళాశాలల బంద్ విరమించారు. ఇప్పడు ఆరోగ్య శ్రీ సేవల బంద్ నిర్ణయంతో సర్కార్‌కు సంకట పరిస్థితి ఏర్పడింది.
Arogyasri:వాస్తవంగా గత 18 నెలలుగా ఈహెచ్ఎస్ బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. మొత్తంగా రూ.1400 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్టు తెలిపింది. అసోసియేషన్ ప్రతినిధులు గత 20 రోజులుగా మంత్రి, ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవోతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ప్రైవేటు ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఫలితం దక్కలేదని తెలిసింది.
Arogyasri:ఆరోగ్య శ్రీ పథకం కింద 323 ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానం ఉన్నది. ఆయా ఆసుపత్రులకు ఈ పథకం కింద రూ.1400 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉన్నది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రభుత్వం 140 కోట్లను విడుదల చేస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిసింది. 100 కోట్లను విడుదల చేశామని, మరో 40 కోట్లను త్వరలో విడుదల చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని సమాచారం. అయితే మొత్తం బకాయిలు ఇచ్చేంత వరకూ సేవలు నిలిపివేస్తామని అసోసియేషన్ ప్రకటించిందని తెలుస్తున్నది.
Arogyasri:ఆరోగ్య శ్రీ నిలిచిపోతే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది నిరుపేదలు విలవిల్లాడి పోతారనే ఆందోళన నెలకొన్నది. అత్యవసరమైన వైద్య సేవలు పొందాల్సిన రోగులు అవస్థలు పడతారని తెలిసింది. సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు ప్రభుత్వం, అటు నెట్‌వర్క్ ఆసుపత్రులు పంతాలు, పట్టింపులకు పోవద్దని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.