Jubilee Hills By-Elections: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలువలేకపోయింది. అనంతరం ఎమ్మెల్యే మృతితో వచ్చిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక సీటును గెలుచుకున్న కాంగ్రెస్, జూబ్లీహిల్స్‌లో కూడా అదే విజయాన్ని పునరావృతం చేయాలని వ్యూహాలు రచిస్తోంది.
రేసులో ప్రధానంగా ఏడుగురు ఉన్నట్లుగా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది. టికెట్ కోసం వీరంతా అధిష్టానం వద్ద పైరవీలు కూడా మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, గెలిస్తే హైదరాబాద్ జిల్లా నుంచి మంత్రి పదవి ఖాయం అనే టాక్ వినిస్తుండటంతో ఆశవాహులు టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. లిస్టులో ప్రముఖంగా నవీన్ యాదవ్, అజారుద్దీన్, అర్జున్ గౌడ్, ఫిరోజ్ ఖాన్, కుసుమ్ కుమార్, విజయారెడ్డి, విక్రమ్ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. స్థానికుడు కావడంతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సాన్నిహిత్యం తనకు కలిసి వస్తుందని అర్జున్ గౌడ్ లెక్కలు వేసుకుంటున్నాడు.
ఇది కూడా చదవండి: Shubhanshu Shukla: స్పేస్ నుండి భూమికి రానున్న శుభాంశు శుక్లా.. క్యారెట్ హల్వా రెడీ చేస్తున్న తల్లి
పొన్నం, పీసీసీ చీఫ్ ఆశీస్సులతో తనకు టికెట్ ఖాయమని ఆయన ధీమాగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ కూతురు విజయారెడ్డి సైతం టికెట్ కోసం బలంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి తన తండ్రి ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఆయన చేసిన అభివృద్ధి పనులు తనకు కలిసి వస్తాయని హైకమాండ్ పెద్దలకు ఆమె వివరిస్తున్నట్లు తెలుస్తోంది. అజారుద్దీన్ ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు 64 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. గతంలో కేవలం 16 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయానని ఈ సారి అవకాశం ఇస్తే గెలుపు గ్యారెంటీ అని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి తనకే పార్టీ టికెట్ ఇస్తుందని చెబుతున్నారు. గెలిస్తే హైదరాబాద్ తో పాటు మైనారిటీ కోటాలో మంత్రి పదవి ఖాయమని ఆయన భావిస్తున్నారు. దీంతో టికెట్ కోసం ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది.