UPI RuPay Transactions: ప్రస్తుతం యూపీఐ, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై వ్యాపారులు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉన్నారు. కానీ త్వరలోనే పెద్ద వ్యాపారాలపై మర్చెంట్ ఛార్జీలను విధించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
వార్షిక ఆదాయం రూ.40 లక్షలకు మించిన వ్యాపారాలు యూపీఐ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (MDR) చెల్లించేలా బ్యాంకింగ్ రంగ ప్రతినిధులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులకు వ్యాపారులు ఛార్జీలు చెల్లిస్తున్న నేపథ్యంలో, యూపీఐ చెల్లింపులపైనా అదే విధంగా ఛార్జీలు విధించాలనే ఆలోచన ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.
UPI RuPay Transactions: ఈ ఛార్జీలను ‘టైర్డ్ ప్రైజింగ్ సిస్టమ్’ ఆధారంగా అమలు చేసే యోచనలో కేంద్రం ఉందని సమాచారం. అంటే, చిన్న వ్యాపారాలపై ఎలాంటి అదనపు భారం లేకుండా, కేవలం పెద్ద వ్యాపారాలకే ఈ విధానం వర్తించనుంది.
అయితే, వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడకపోయినా, వ్యాపారులు మళ్లీ నగదు లావాదేవీలను ప్రోత్సహించే అవకాశముందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. గతంలో 2022 వరకు యూపీఐ లావాదేవీలపై MDR ఛార్జీలు ఉండేవి, కానీ ఆ తర్వాత ప్రభుత్వం అవి తొలగించి బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలకు సబ్సిడీలు అందజేయడం ప్రారంభించింది. అయితే, ఈ ఏడాది బడ్జెట్‌లో ఆ సబ్సిడీని గణనీయంగా తగ్గించడంతో, తిరిగి ఛార్జీలను అమలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని భావిస్తున్నారు.