APSRTC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఏపీఎస్ఆర్టీసీ అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్లను వాట్సాప్ ద్వారానే బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆధునిక సాంకేతికతను మరింత విస్తృతంగా వినియోగించుకునే దిశగా ఈ కొత్త సేవను ప్రారంభించింది.
ప్రయాణికులు తమ మొబైల్‌లోని వాట్సాప్ యాప్ ద్వారా 9552300009 నంబర్‌కు ‘హాయ్’ అని మెసేజ్ పంపితే, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన సేవలు వెంటనే అందుబాటులోకి వస్తాయి. ఈ సేవను ప్రభుత్వ అధికారిక వాట్సాప్ ప్లాట్‌ఫామ్ అయిన ‘మన మిత్ర’ ద్వారా అందిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఈ సౌకర్యం ఉండటంతో అన్ని వర్గాల ప్రయాణికులు సులభంగా వినియోగించుకునే వీలుంది.
Also Read: Amaravati: ఏపీ సచివాలయంలో నేడు కలెక్టర్ల సదస్సు
ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తూ వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే వారి కోసం అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం ఇప్పటికే అమల్లో ఉంది. ఇప్పటి వరకు రెడ్‌బస్, అభిబస్, పేటీఎం వంటి ప్రైవేట్ ఫ్రాంచైజీలు లేదా టికెట్ బుకింగ్ ఏజెంట్ల ద్వారా మాత్రమే రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకునే పరిస్థితి ఉండేది.
ఇప్పుడు వాట్సాప్ ద్వారా నేరుగా ఏపీఎస్ఆర్టీసీ సేవలను పొందే అవకాశం కలగడంతో ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలగనుంది. టెక్నాలజీ వినియోగంలో ఎప్పుడూ ముందుండే ఏపీఎస్ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవతో ఈ కొత్త విధానాన్ని అమలు చేసింది. దీని ద్వారా టికెట్ బుకింగ్ ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంది.
వాట్సాప్ వంటి అందరికీ అందుబాటులో ఉన్న మాధ్యమం ద్వారా రిజర్వేషన్ సదుపాయం రావడంతో, టికెట్ల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్లు లేదా ఏజెంట్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గనుంది. ఈ సేవ ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, డిజిటల్ సేవలను మరింత విస్తరించడంలో కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.

