Xiaomi: ప్రముఖ టెక్ కంపెనీలైన యాపిల్, శాంసంగ్ ఇటీవల చైనాకు చెందిన షావోమీ సంస్థకు లీగల్ నోటీసులు పంపాయి. షావోమీ ప్రకటనల విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ నోటీసులు జారీ అయ్యాయి. షావోమీ సంస్థ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునే క్రమంలో యాపిల్ మరియు శాంసంగ్ ఫోన్‌లతో నేరుగా పోల్చి చూపిస్తూ ప్రకటనలు ప్రసారం చేసింది. ఈ ప్రకటనలు తమ ఉత్పత్తుల విలువను తగ్గించేలా ఉన్నాయని, తమను ప్రతికూలంగా చూపిస్తున్నాయని యాపిల్, శాంసంగ్ ఆరోపించాయి.షావోమీ ఈ వ్యూహాన్ని ‘అంబుష్’ మార్కెటింగ్‌గా యాపిల్, శాంసంగ్ అభివర్ణించాయి.
Also Read: Raghuram rajan: అమెరికా టారిఫ్‌లపై రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు
ఈ రకమైన ప్రకటనలు మార్కెటింగ్ పోటీ పరిమితులను దాటాయని, దీని వల్ల తమ బ్రాండ్ విలువకు నష్టం జరుగుతోందని పేర్కొన్నాయి.షావోమీ గతంలో కూడా ఇలాంటి ప్రకటనలను ప్రసారం చేసింది. ఉదాహరణకు, ఐఫోన్ 15 సిరీస్ విడుదల సమయంలో, ఐఫోన్ కెమెరాను చిన్నచూపు చూస్తూ, తమ లెన్స్ అద్భుతమైనదని షావోమీ ప్రచారం చేసింది. దేశంలోని ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో షావోమీ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఈ మార్కెట్‌లో ప్రస్తుతం యాపిల్, శాంసంగ్‌ల ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో షావోమీ ఈ రకమైన వ్యూహాలను అనుసరిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ఈ లీగల్ నోటీసులపై షావోమీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
