ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,396 షాపులుండగా వాటికి గతనెల 30న అర్దరాత్రి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తొలుత జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు స్వీకరణ గడువు నేటితో ముగియనుంది.
దసరా సెలవులు, ఇతర కారణాల నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం.. గడువును రెండు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
11వ తేదీ పాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించింది. 14వ తేదీన అధికారులు మద్యం షాపులకు లాటరీ తీయనున్నారు. 16వ తేదీ నుంచి లైసెన్సుదారులు దుకాణాలను ప్రారంభించుకోవచ్చు. ఇక అదేరోజు నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుంది.
ఇక మొత్తం 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ ఇవ్వగా మంగళవారం రాత్రి 9 గంటల వరకూ 41,348 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.