Shakti Cyclone

Shakti Cyclone: ముంచుకొస్తున్న ‘శక్తి’ తుపాను ముప్పు.. అక్టోబర్ 10 వరకు భారీ వర్షాలు

Shakti Cyclone: బంగాళాఖాతం, అరేబియా సముద్రం- రెండు వైపులా వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం సాయంత్రం ఒడిశా తీరంలోని గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు విరుచుకుపడ్డాయి. భారీ వర్షాలు కురిసాయి. అయితే శుక్రవారం ఉదయానికి ఇది క్రమంగా బలహీనపడుతూ వాయుగుండంగా మారింది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, ఇది ఒడిశా – ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తర–వాయవ్య దిశగా కదులుతూ, శనివారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది.

మరోవైపు ‘శక్తి’ తుపాను రూపం దాల్చింది

ఇక అరేబియా సముద్రంలో మరో వ్యవస్థ చురుగ్గా మారింది. అక్కడ ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందింది. భారత వాతావరణశాఖ (IMD) దీనికి ‘శక్తి’ అనే పేరు ఇచ్చింది. శనివారం నాటికి ఇది తీవ్ర తుపానుగా బలం పుంజుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుపాను ఇదే కావడం విశేషం.

ఇది కూడా చదవండి: Warangal: ఆ ఎస్ఐపై వేటు ప‌డింది.. ద‌ళిత మ‌హిళ‌పై దాడికి సీపీ చ‌ర్య‌

ప్రస్తుతం ‘శక్తి’ తుపాను ద్వారకకు నైరుతి దిశగా 240 కిలోమీటర్లు, పోర్‌బందర్‌కు పశ్చిమం వైపుగా 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది గంటకు సుమారు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతోంది. తుపాను మార్గం ఇంకా సముద్రంపైనే ఉన్నప్పటికీ, తీర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.

తుపాన్లకు పేర్లు ఎవరు పెడతారు?

ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) మార్గదర్శకాల ప్రకారం, హిందూ మహాసముద్రం తీర ప్రాంత దేశాలైన 13 దేశాలు తుపాన్ల పేర్లను నిర్ణయించే అధికారం కలిగి ఉన్నాయి. వాటిలో భారత్‌, బంగ్లాదేశ్‌, ఇరాన్‌, మాల్దీవులు, మయన్మార్‌, ఒమన్‌, పాకిస్థాన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్‌, యూఏఈ, యెమెన్‌ ఉన్నాయి.

ప్రతి దేశం తన జాబితా నుంచి పేర్లు సూచిస్తుంది. ఈసారి ‘శక్తి’ అనే పేరు శ్రీలంక సూచించింది. పేర్లు చిన్నగా, సులభంగా పలికేలా ఉండాలనే నిబంధన ఉంది. తుపాన్లకు ప్రత్యేక పేర్లు ఇవ్వడం వల్ల ప్రభుత్వ విభాగాలు, మీడియా, ప్రజలకు స్పష్టమైన గుర్తింపు ఉంటుంది. అలాగే ఆ పేరుతో హెచ్చరికలు, రక్షణ చర్యలు సులభంగా అమలు చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Israel-Hamas war: యుద్ధం ముగించండి.. ట్రంప్ వార్నింగ్

ప్రస్తుతం బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడుతున్నప్పటికీ, అరేబియా సముద్రంలోని ‘శక్తి’ తుపాను మరింత బలపడే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలు వాతావరణ అప్‌డేట్స్‌పై కన్నేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *