AP Mock Assembly

AP Mock Assembly: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో విద్యార్థుల మాక్‌ అసెంబ్లీ సందడి

AP Mock Assembly: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అసెంబ్లీ ఎలా పనిచేస్తుందో విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కల్పించాలనే ఉద్దేశంతో మాక్‌ అసెంబ్లీని ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం ప్రారంభమైన ఈ సమావేశంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు స్పీకర్, సీఎం, మంత్రులు, ప్రతిపక్ష నేత వంటి బాధ్యతలను చేపట్టి అసెంబ్లీ ప్రక్రియలను స్వయంగా నిర్వహించారు.

మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. మాక్ అసెంబ్లీలో మన్యం జిల్లాకు చెందిన ఎం. లీలా గౌతమ్ ముఖ్యమంత్రిగా, సౌమ్య ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి డిప్యూటీ సీఎంగా, తిరుపతి జిల్లా విద్యార్థి చిన్మయి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి స్పీకర్ పాత్రను పోషించింది.

Also Read: Telangana 10th Exams: స్టూడెంట్స్ కు అలర్ట్.. మార్చి 18 నుంచి 10th ఎగ్జామ్స్!

సామాజిక మాధ్యమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థులు స్వల్పకాలిక చర్చ జరిపారు. అసెంబ్లీ చాలా చురుకుగా సాగడంతో అక్కడి వాతావరణం నిజమైన శాసనసభను తలపించింది. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల పాఠశాలలకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసి మరింత మంది విద్యార్థులకు అవగాహన కల్పించారు.

రాజ్యాంగ ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ సీఎం చంద్రబాబు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి రక్షణ కల్పించే శక్తివంతమైన పునాదిగా నిలిచిందని, స్వర్ణాంధ్ర నిర్మాణం, వికసిత భారత్ సాధనకు ఇదే మార్గదర్శకమని అన్నారు. మంత్రి నారా లోకేశ్‌ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యాశాఖ ఈ దినోత్సవాన్ని వినూత్నంగా మార్చిందని ఆయన అభినందించారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *