AP News: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే ‘స్త్రీ శక్తి’ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఈ పథకం ద్వారా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు కొన్ని రకాల ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు.
పథకం వివరాలు :
అమలు తేదీ: ఆగస్టు 15, 2025 నుంచి ఈ పథకం ప్రారంభం అవుతుంది.
అర్హత: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ఈ పథకానికి అర్హులు. ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది.
వర్తించే బస్సులు: ఈ పథకం కింద పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు.
వర్తించని బస్సులు: సప్తగిరి బస్సులు (తిరుమల-తిరుపతి మధ్య), నాన్‌స్టాప్ బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు ఈ పథకం వర్తించదు.
ఈ పథకం అమలు వల్ల బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం కొన్ని భద్రతా చర్యలను ఆదేశించింది. బస్సులలో సీసీ కెమెరాలు, కండక్టర్లకు బాడీ ఓర్న్ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఆర్టీసీ ఎండీకి ఆదేశాలు జారీ చేశారు. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఈ మేరకు జీవో జారీ చేశారు.