AP News: మానవీయ విలువలు దిగజారి పోతున్నాయనడానికి ఇదో నిదర్శనం. పిల్లల్లో అసహజ జాఢ్యం పెరుగుతుందనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. చిన్నతనంలోనే విపరీత లక్షణాలు వస్తున్నాయనడానికి ఈ పిల్లల దుశ్చర్యతో తెలుస్తున్నది. ఇంతటి దుర్మార్గానికి పిల్లలే ఒడిగట్టారంటే మున్ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ఘటనే మనకు పాఠంగా మారింది. ఇది సాదాసీదా ఘటన కాదు. తల్లిదండ్రుల తర్వాత గురువే ప్రత్యక్ష దైవం అని చెప్పుకునే మన సమాజంలోనే ఓ ఉపాధ్యాయుడిని విద్యార్థులు కొట్టి చంపిన దుర్ఘటన అందరినీ కలచివేస్తున్నది.
AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్‌లో ఏజాస్ అనే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. ఎప్పటిమాదిరిగానే తొమ్మిదో తరగతి గదిలో ఆయన పాఠాలు చెప్పేందుకు వెళ్లారు. అక్కడికి వెళ్లగానే పిల్లలంతా అల్లరి చేయసాగారు. అందరు ఉపాధ్యాయుల మాదిరిగానే, తనూ రోజూ చేసే పనిలాగానే అనుకున్నాడు. తెలిసీ తెలియని పిల్లలు కదా, తెలుసుకుంటారు.. అని తలచాడు. అల్లరి చేసిన పిల్లలను ఆయన మందలించారు. అల్లరి చేయొద్దని వారించారు.
AP News: ఇదే ఆయన చేసిన పెద్ద తప్పయింది. వారు పిల్లలు కాదు తన పాలిట యములు అని ఆ ఉపాధ్యాయుడు భావించలేకపోయాడు. మందలించాడనే ఒక్క కారణంతో ఆ పిల్లలంతా ఆగ్రహంతో ఊగిపోయారు. విద్యార్థులంతా ఒక్కుమ్మడిగా ఉపాధ్యాయుడిపై పడి దాడి చేశారు. ఛాతీపై కొట్టడంతో ఏజాస్ తరగతి గదిలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ఏజాస్‌ను తోటి ఉపాధ్యాయులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
AP News: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉపాధ్యాయుడు ఏజాస్ కన్నుమూశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడా జరగనిది.. ఎవరూ చేయనిది.. మళ్లీ జరగకూడనిది.. ఇప్పటికైనా ఈ విపరీత ధోరణికి అడ్డుకట్ట వేయకుంటే మున్ముందు సమాజం ఎంతో నష్టపోవాల్సి వస్తున్నది.