AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన వైజాగ్, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులకు అక్కడి కూటమి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలయికతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆనాటి ఎన్నికల హామీలను ఒక్కొక్కటీ అమలు చేస్తూ ముందుకు సాగుతున్నది. ఈ దశలోనే మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ రెండు నగరాల్లో రెండు దశల్లో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని సర్కారు నిర్ణయించింది.
AP News: వైజాగ్ నగరంలో మెట్రో ప్రాజెక్టులో భాగంగా ఫస్ట్ ఫేజ్ కింద 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్ల నిర్మాణానికి నిర్ణయించింది. మెట్రోలైన కారిడార్ -1 కింద విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కిలోమీటర్లు, కారిడార్ -2 కింద గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీసు వరకు 5.08 కిలోమీటర్లు, కారిడార్ -3 కింద తాటిచెట్లపాలెం నుంచి చిన వాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల లైన్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రెండో దశలో కారిడార్-4 కింద కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు 30.67 కిలోమీటర్ల వరకు మెట్రో లైన్ నిర్మాణం చేపట్టనున్నది.
AP News: విజయవాడలో తొలి దశలో మెట్రోలైన్ కారిడార్ -1 కింద గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు, కారిడార్ -2 కింద పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు నిర్మాణం చేపట్టనున్నది. రెండో దశలో కారిడార్ -3 కింద పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు మెట్రో నిర్మాణానికి ఏపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయా నగరాలు అభివృద్ధి చెందడంతో పాటు ప్రజారవాణా మెరుగవుతుంది. అదే విధంగా పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది.