AP news: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో నిర్మాణాలు, ఐటీ రంగ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై కూడా కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. ఈ విషయాలను మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, నిమ్మల రామానాయుడు, అనిత మీడియాకు వివరించారు.
ఎస్సీ వర్గీకరణకు ఆమోదం
ఎస్సీ ఉపకులాల మధ్య ఉన్న సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకొని, 59 ఉపకులాల వర్గీకరణకు ప్రభుత్వం ముందుకొచ్చింది. గతంలో నియమించిన జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక, సుప్రీంకోర్టు తీర్పులు, జాతీయ ఎస్సీ కమిషన్ సూచనల ఆధారంగా ముసాయిదా ఆర్డినెన్స్ రూపొందించబడింది. దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ఈ వర్గీకరణ ప్రకారం:
గ్రూప్–1: 12 ఉపకులాలకు 1% రిజర్వేషన్
గ్రూప్–2: 18 ఉపకులాలకు 6.5% రిజర్వేషన్
గ్రూప్–3: 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్
ఈ విధంగా 200 పాయింట్ల రోస్టర్ విధానాన్ని అమలు చేసి విద్య, ఉద్యోగాల్లో అన్ని ఉపకులాలకు సమాన అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు.