AP Inter Results 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో హాజరైన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం కూడా పూర్వాపరాల మాదిరిగానే అమ్మాయిలే టాపర్లు కావడం గర్వకారణం. ఫలితాల్లో అగ్రస్థానాలు కైవసం చేసుకున్న వారు ఎక్కువగా బాలికలే కావడం విద్యా రంగంలో వారు చూపుతున్న కృషిని స్పష్టంగా తెలియజేస్తుంది.
ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులకు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ resultsbie.ap.gov.in, అంతేకాకుండా, ప్రభుత్వం ప్రారంభించిన మన మిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా కూడా ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. 9552300009 నంబరుకు ‘hi’ అని మెసేజ్ పంపితే, మీ ఫలితాలు మీ మొబైల్‌లోకి వచ్చేస్తాయి.
ఇతర ముఖ్యాంశాల్లో, ఈ సంవత్సరం ఫలితాల ప్రకటనలో మరో విశేషం ఏమిటంటే – గత 10 ఏళ్లలోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ సంవత్సరం నమోదవడం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన వివరాల ప్రకారం:
-
ఇంటర్ మొదటి సంవత్సరం – 70% ఉత్తీర్ణత
-
ఇంటర్ రెండో సంవత్సరం – 83% ఉత్తీర్ణత
ప్రభుత్వ జూనియర్ కళాశాలల (GJCs) లోనూ మెరుగైన ఫలితాలు నమోదయ్యాయి. రెండో సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 69% కాగా, ఇది గత దశాబ్దంలో అత్యధికం. మొదటి సంవత్సరం విద్యార్థుల ఫలితాలు కూడా 47% ఉత్తీర్ణతతో రెండవ అత్యుత్తమ స్థాయిని సాధించాయి.
ఈ విజయానికి పునాది వేసిన విద్యార్థులు, టీచర్లు, పాఠశాలల సిబ్బంది అందరికీ మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. విద్యార్ధుల భవిష్యత్తు ముందున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఫలితాలు మైలురాయిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

