Shree Charani: మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసి, దేశానికి గర్వకారణంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ కడప అమ్మాయి, టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణిపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. విశ్వ విజేత జట్టులో సభ్యురాలిగా ఉన్న శ్రీ చరణికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహుమతులను ప్రకటించారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ చరణికి రూ. 2.5 కోట్ల నగదు బహుమతిని అందించనుంది. అంతేకాకుండా, ఆమెకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. వీటితో పాటు, ఆమె స్వస్థలం అయిన కడపలో ఇంటి స్థలం కూడా ప్రభుత్వం తరపున ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ శుభవార్తను స్వయంగా శ్రీ చరణి మంగళగిరి స్టేడియంలో మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన శ్రీ చరణికి గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు అనిత, సంధ్యా రాణి, సవిత, ఏసీఏ చైర్మన్ కేశినేని చిన్ని, మాజీ క్రికెటర్లు మిథాలీ రాజ్, ఎంఎస్కే ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయంకు వెళ్లిన శ్రీ చరణి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. ప్రపంచకప్‌లో ఆమె అద్భుత ప్రదర్శన చేసినందుకు సీఎం అభినందించారు. ఈ సందర్భంగా వరల్డ్ కప్ గెలిచిన సంతోష క్షణాలను శ్రీ చరణి ముఖ్యమంత్రి మరియు మంత్రి లోకేశ్‌తో పంచుకున్నారు. దేశానికి కీర్తి తెచ్చిన శ్రీ చరణికి ఏపీ ప్రభుత్వం ఈ గొప్ప బహుమతులు ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
