AP Govt

AP Govt: ఏపీ ప్రభుత్వం ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్‌!

AP Govt:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా రాష్ట్ర ప్రజలపై కనకాభిషేకం కురిపించింది. అటు విద్యుత్ వినియోగదారులకు, ఇటు భూ యజమానులకు ఊరటనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు కీలకమైన నిర్ణయాలను ప్రకటించింది. 2026వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ, సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా ఉండటమే లక్ష్యంగా సుమారు రూ. 4,497 కోట్ల విద్యుత్ ట్రూఅప్ ఛార్జీలను తామే భరిస్తామని ప్రభుత్వం ప్రకటించి ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. మరోవైపు, దశాబ్దాలుగా నలుగుతున్న భూ వివాదాలకు ముగింపు పలుకుతూ నిషిద్ధ భూముల జాబితా (22A) నుంచి ఐదు రకాల భూములను తొలగిస్తూ రెవెన్యూ శాఖ సరికొత్త ఉత్తర్వులను విడుదల చేసింది.

విద్యుత్ కష్టాలకు వీడ్కోలు: రూ. 4,497 కోట్ల భారం సర్కారుదే!
సాధారణంగా విద్యుత్ ఛార్జీల పెంపుతో బెంబేలెత్తే సామాన్యుడికి ఈసారి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) ఆమోదించిన రూ. 4,497.89 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే డిస్కంలకు చెల్లించాలని నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై పడాల్సిన అదనపు భారం తప్పుతుంది. ఎన్నికల హామీలో భాగంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువస్తామని చెప్పిన ప్రభుత్వం, 2029 నాటికి యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని రూ. 4 లోపు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గతేడాది రూ. 5.19 గా ఉన్న కొనుగోలు వ్యయం, ప్రస్తుతానికి రూ. 4.90 కి తగ్గడం గమనార్హం.

Also Read: AP: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు..

రెవెన్యూ రంగంలో విప్లవం: 22A నిషిద్ధ జాబితా నుంచి భూముల తొలగింపు
రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నూతన సంవత్సరం సందర్భంగా భూ యజమానులకు చిరకాల కోరికను నెరవేర్చారు. 22A నిషిద్ధ జాబితాలోని చిక్కుల వల్ల భూముల అమ్మకాలు, కొనుగోళ్లు చేయలేక ఇబ్బంది పడుతున్న రైతులకు, ప్రైవేటు పట్టా భూ యజమానులకు విముక్తి లభించింది. ముఖ్యంగా:

ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూములు.
స్వాతంత్య్ర సమరయోధుల భూములు.
రాజకీయ బాధితులకు కేటాయించిన భూములు.

నిబంధనల ప్రకారం ఉన్న ప్రైవేటు పట్టా భూములు. వంటి ఐదు విభాగాలకు చెందిన భూములను 22A జాబితా నుంచి తొలగిస్తూ మంత్రి తొలి సంతకం చేశారు. మిగిలిన నాలుగు రకాల భూములపై కూడా త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సౌకర్యవంతమైన పాలన: పత్రాల వేధింపులకు స్వస్తి
భూముల తొలగింపు ప్రక్రియలో అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ప్రభుత్వం నిబంధనలను సరళతరం చేసింది. అడంగల్స్, 10(1) రిజిస్టర్, ఎసైన్మెంట్ రిజిస్టర్లు లేదా డికెటీ పట్టా.. ఇలా అందుబాటులో ఉన్న దాదాపు 8 రకాల పత్రాలలో ఏ ఒక్కటి ఉన్నా భూమిని నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్లను ఆదేశించింది. ప్రైవేట్ భూముల విషయంలో అధికారులు స్వచ్ఛందంగా స్పందించి ఆంక్షలు తొలగించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో ప్రజలకు ఆర్థిక వెసులుబాటుతో పాటు, తమ భూములపై పూర్తిస్థాయి హక్కులు దక్కనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *