AP Govt: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వేడిని రాజేశాయి. తాను ఒత్తిడి చేయడం వల్లే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు పనులను ఆపేశారని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఆరోపణలేనని కొట్టిపారేసింది.
ఏపీ ప్రభుత్వం తన వివరణలో అసలు విషయం బయటపెట్టింది. గత జగన్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించారని, ఆ సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం కోర్టులు మరియు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిందని గుర్తు చేసింది. ఆ ఫిర్యాదులను విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) మరియు కేంద్ర ప్రభుత్వం.. అనుమతులు లేని కారణంగా 2020లోనే పనులను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చాయని స్పష్టం చేసింది. అంటే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఈ పనులు నిలిచిపోయాయని ఏపీ ప్రభుత్వం వివరించింది.
తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కేవలం చంద్రబాబు నాయుడి పేరును వాడుకుని రాజకీయంగా లాభపడాలని చూస్తున్నాయని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. ఏపీకి ఉన్న నీటి హక్కుల విషయంలో గానీ, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో గానీ ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి మాటలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, కేవలం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికే ఆయన ఇలాంటి అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది.
అంతకుముందు తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను చంద్రబాబు నాయకత్వంలో పనిచేసినా, తనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. తనపై ఉన్న గౌరవంతోనే చంద్రబాబు ఆ పనులను ఆపారని, కావాలంటే నిజనిర్ధారణ కమిటీని పంపి చెక్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
