Polavaram-Banakacharla: రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలవరం-బనకచర్ల నీటితరలింపు ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రతిపాదనలు అందించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.81,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించింది.
ఈ నేపథ్యంలో, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేత్ కు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ ప్రజెంటేషన్‌లో ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి వివరాలు, లాభనష్టాలు, ప్రజలకు కలిగే ప్రయోజనాలు, నీటి పంపిణీ విధానం, భూసేకరణ తదితర అంశాలను వివరించనున్నారు.
గత నెలలో జరిగిన సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించారు. అప్పట్లో కేంద్ర ఆర్థిక శాఖ ఈ ప్రాజెక్టుపై మరింత సమగ్ర వివరాలు పంపించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. దానికి స్పందనగా ఈ రోజు ఈ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు.
Also Read: Etala rajendar: తెలంగాణకు బీజేపీనే దిక్సూచి
Polavaram-Banakacharla: చంద్రబాబు పేర్కొనినట్లు, ప్రతి సంవత్సరం సముద్రంలో వృథాగా పోతున్న సుమారు 2,000 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా ఉపయోగించుకోవచ్చని, ఇది రాయలసీమ రైతులకు మేలుగా మారుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తి అయితే ఇది స్వీయ ఆర్థికంగా నడిచే ప్రాజెక్టుగా అభివృద్ధి చెందుతుందని, అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇది ప్రయోజనకరమయ్యే అవకాశం ఉందని వివరించారు.
అలాగే, తెలంగాణ రాష్ట్రం లేవనెత్తే అభ్యంతరాలపై కూడా ఈ ప్రజెంటేషన్‌లో సమాధానాలు ఇవ్వనున్నారు. తెలంగాణకు ఇచ్చే హక్కుదారుల జలాలు తాము తీసుకోవడం లేదని, ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రయోజనాలు సాధ్యమవుతాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయనుంది.

