AP DGP: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ నేరాలను అరికట్టేందుకు ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ, సైబర్ క్రైమ్ నియంత్రణ కోసం కఠిన చర్యలు చేపడుతున్నామని, ప్రజల్లో అవగాహన పెంచి నేరస్థుల బారిన పడకుండా జాగ్రత్త పడేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
డీజీపీ మాట్లాడుతూ, చిన్న పిల్లలపై, వృద్ధులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని, ఇది సభ్య సమాజం సిగ్గుపడే విషయం అని అభిప్రాయపడ్డారు.
గంజాయి నివారణకు ఈగల్ సంస్థ
గంజాయి సమస్యపై మాట్లాడుతూ, రాష్ట్రంలో గంజాయి ఎక్కడ పట్టుబడినా దాని మూలాలు ఉత్తరాంధ్రలోనే ఉన్నాయని డీజీపీ తెలిపారు. గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేకంగా ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి, మాదక ద్రవ్యాలపై నియంత్రణ సాధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అలాగే, పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని, రాష్ట్ర ప్రభుత్వం కూడా గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.
నేరాల నివారణకు సీసీ కెమెరాలు
నేరాలను అరికట్టడంలో టెక్నాలజీ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, డీజీపీ ద్వారకా తిరుమలరావు రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ స్పాట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎక్కడ నేరం జరిగినా, కనీసం ఒక సీసీ కెమెరాలో రికార్డు అవ్వాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మార్చి 1 నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఇందుకోసం దాతలు, ప్రజల సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు.
