Pawan Kalyan: పాకిస్తాన్‌పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న భారత దేశాన్ని వెనక్కి నెట్టాలన్న కుట్రలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మీరు మా దేశంలోకి వచ్చి కొడితే… మేము మీ ఇళ్లలోకి దూరి కొడతాం” అంటూ పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ వార్నింగ్ ఇచ్చారు.
విజయవాడలో జరిగిన “తిరంగా యాత్ర”లో పాల్గొన్న పవన్, జాతీయ ఐక్యతకు ప్రతీకగా ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు. ఇందిరాగాంధీ మైదానం నుంచి బెంజ్ సర్కిల్ వరకు జరిగిన ఈ యాత్రలో సీఎం చంద్రబాబు, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రులు, ఎంపీలు, విద్యార్థులు, నగర ప్రజలు పాల్గొన్నారు. “ఆపరేషన్ సిందూర్” విజయవంతం అయిన సందర్భంగా సైనికులకు శుభాకాంక్షలు తెలియజేసే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ – “పాకిస్తాన్ గత దశాబ్దాలుగా మన దేశంపై ఉగ్రదాడులకు పాల్పడుతోంది. గోకుల్ ఛాట్, లుంబినీ పార్క్, జామా మసీదు పేలుళ్లలో దాగి ఉన్న వారిని మనం చూశాం. ఇప్పటికీ జమ్ము కాశ్మీర్, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో ప్రశాంతత లేకుండా చేస్తున్నది పాక్ కుట్రే. ఇక చాలు.. ఇది నయా భారత్!” అని స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ మరింత ముందుకు వెళ్లి – “శాంతి వచనాలు పాక్‌కి పని చేయవు. సైనికులకు మద్దతుగా మనం నిలబడ్డాలి. సెక్యులరిజం పేరుతో ఆర్మీని కించపరిచే వ్యాఖ్యలు చేస్తే ఊరుకోకూడదు. ప్రతీ భారతీయుడు వీర జవాన్‌లకు ధైర్యంగా అండగా ఉండాలి” అన్నారు.
మురళీ నాయక్ జవాన్ త్యాగాన్ని కొనియాడిన పవన్ కల్యాణ్, “భారత మాతాకీ జై” నినాదంతో ఆయనకు నివాళులర్పించారు. బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు మాట్లాడకపోతే ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాఖ్యానించారు. “వాళ్లు కేవలం ఎంటర్టైనర్స్. దేశభక్తి సెలబ్రిటీల వద్ద నుంచి ఆశించవద్దు. మేము ప్రజా ప్రతినిధులం. మా గొంతులో ప్రజల గుండె ధ్వనించాలి” అన్నారు.
ఇలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలు చేస్తూ, పవన్ కల్యాణ్ తిరంగా యాత్ర ద్వారా దేశ ఐక్యతకు గళం కలిపారు. పాకిస్తాన్ కుట్రలకు భారత ప్రభుత్వం తగిన జవాబు చెప్పాలని ప్రజల్లో విశ్వాసం నింపారు.

